Acharya Chanakya : సమాజంలోని అందరితో మనం కలసి మెలసి ఉండాలనే అనుకుంటాం. ఆ ప్రకారంగానే మనం చేసే పనులు కూడా ఉంటాయి. అయితే అనుకోకుండా అప్పుడప్పుడు కొందరు మనకు శత్రువులుగా కూడా మారుతుంటారు. కానీ కొందరైతే అదే పనిగా వివిధ పనులు చేస్తూ అందరితోనూ శత్రుత్వం పెంచుకుంటూ ఉంటారు. అయితే ఎలా ఏర్పడినా శత్రువులు అంటూ తయారయ్యాక వారిని లేకుండా చేసుకోవడమే పనిగా పెట్టుకోకూడదు. ఆచితూచి అడుగేయాలి. సందర్భం వచ్చినప్పుడు చెక్ పెట్టాలి. ఈ క్రమంలో శత్రువుల పట్ల ఎలా ప్రవర్తించాలో ఆచార్య చాణక్యుడు మనకు చెప్పాడు. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
శత్రువులను ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకూడదు. వారిని మన కన్నా ఎక్కువగానే ఊహించుకుని అడుగు ముందుకు వేయాలి. లేదంటే మొదటికే మోసం వస్తుంది. తెలివిమంతులు ఎవరూ నేరుగా శత్రువులను అటాక్ చేయరు. శత్రువులకు చెందిన ఒక్కో స్టెప్‌ను తెలుసుకుంటూ ఆచి తూచి ప్రవర్తిస్తారు. శత్రువు బలం, బలహీనతలను గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. అనంతరం వారిని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. దాన్ని విశ్లేషించాలి. అప్పుడే అడుగు ముందుకు వేయాలి. శత్రువుకు ఉన్న నైపుణ్యం, మనకు ఉన్న నైపుణ్యాలను బేరీజు వేసుకోవాలి. శత్రువును ఎలా అటాక్ చేస్తామో ముందుగానే రిహార్సల్ చేసుకుని ఓ అంచనాకు రావాలి. అప్పుడే ప్రణాళిక రచించాలి. దాన్ని అమలు చేయాలి.
ఎంత పెద్ద శత్రువును ఢీకొనే ముందు అయినా ప్రశాంతంగా ఉండాలి. అనుకోని పరిస్థితులు ఎదురైతే ఎలా స్పందించాలో తెలిసుండాలి. దాని ప్రకారం మెదడు వాడుతూ ముందుకు సాగాలి. శత్రువును బలంగా దెబ్బ కొట్టాలంటే బలమైన శరీరం ఉండాల్సిన పనిలేదు. బుద్ధి బలం ఉన్నా చాలు. శత్రువును ఎప్పుడూ ద్వేషించకూడదు. ఆటలో అతన్ని ఒక ప్రత్యర్థిగా చూడాలి. అప్పుడే విజయం కలుగుతుంది.