కుక్కలు చాలా కాలం నుంచి మనుషులకు అత్యంత విశ్వాసమైన నమ్మిన బంట్లుగా ఉంటున్నాయి. పెంపుడు జంతువు అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది కూడా కుక్కే. ఈ క్రమంలోనే చాలా మంది తమ ఇష్టాలు, తాహతుకు అనుగుణంగా కుక్కలను పెంచుకుంటారు. వాటి సంరక్షణ బాధ్యత చేపడతారు. అయితే కుక్కల గురించి చాలా మందికి తెలియని విషయం ఒకటుంది. అదేమిటంటే… కుక్కలు కూడా కలలు కంటాయట. అవును, మీరు విన్నది కరెక్టే. ఇది మేం చెబుతోంది కాదు. ఓ మానసిక శాస్త్రవేత్త చెబుతున్నారు.
హార్వార్డ్ మెడికల్ స్కూల్‌కు చెందిన డాక్టర్ డెయిర్‌డ్రె బ్యారెట్ అనే ఓ మహిళా మానసిక శాస్త్రవేత్త ఉంది. ఆమె కుక్కలపై విస్తృతంగా పరిశోధనలు చేసింది. ప్రధానంగా అవి నిద్రిస్తున్న సమయంలో ఏం చేస్తుంటాయనే విషయంపై ఆమె పరిశోధనలు చేసింది. ఈ క్రమంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. కుక్కలు నిద్రిస్తున్న సమయంలో అవి కలలు ఉంటాయట. అవును, అది చాలా వరకు నిజమేనట. అలా అని బ్యారెట్ చెప్పింది. అయితే అవి ఎలాంటి కలలో తెలుసా..?
కుక్కలు కలలు కంటే సాధారణంగా అవి ఎలాంటివి అయి ఉంటాయి..? మనుషులైతే రోజూ తాము తిరిగిన ప్రదేశాలు, జరిగిన సంఘటనలు, కలసిన వ్యక్తులను బట్టి కలలు కంటారు. ఒక్కో సారి పొంతన లేని కలలు కూడా వస్తాయి. అయితే కుక్కలు కలలు కంటే అవి ఎలా ఉంటాయి..? ఇదే అంశంపై కూడా డాక్టర్ బ్యారెట్ పరిశోధనలు చేసింది. దీంతో తెలిసిందేమిటంటే… కుక్కలు కనే కలలు వాటి గురించి కాదట, వాటిని పెంచే యజమానుల గురించి కలలు కంటాయట. తమకు ఆహారం పెడుతున్నట్టు, తమతో కలసి యజమాని ఆడుకుంటున్నట్టు, వాకింగ్‌కు తీసుకెళ్తున్నట్టు… ఇలా రక రకాల కలలను కుక్కలు కంటాయట. దీంతో ఈ విషయాన్ని బ్యారెట్ స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్‌లో తెలియజేసింది. ఈ విషయాన్ని తెలుసుకున్న శునక ప్రేమికులు ట్విట్టర్‌లో ట్వీట్లతో హోరెత్తించారు. తాము పెంచుకుంటున్న కుక్కల ఫొటోలను తీసి ఆ అభిమానాన్ని అందరితో పంచుకున్నారు. అవును మరి, అవి అంత విశ్వాస పాత్రమైనవి కాబట్టే, వాటిపై ఎవరికైనా ప్రేమే ఉంటుంది..!