మన తాతముత్తాతల్లో చాలామంది వరి అన్నాన్ని పండగ పూట మాత్రమే తినేవారు. కానీ ఈ రోజు మనం ప్రతి రోజు తెల్ల అన్నాన్ని తింటున్నాము. మనకు తెల్ల అన్నంతో విడదీయ రాని బంధం ఏర్పడింది. పూర్వం అంటే ఓ డెబ్భై ఏళ్ళ క్రితం చాలా తెలుగు ప్రాంతాల్లో వరిఅన్నం పండగలప్పుడే తినే వారట. ఎందుకూ అంటే.. వరి పండడానికి మాగాణి నేలలు కావాలి. అంటే నీరు ఎక్కువగా అవసరం అవుతుంది. అంటే ఎల్లప్పుడూ పారే నీటి వసతి ఉన్న ప్రాంతాల్లోనే ఎక్కువ స్థాయిలో వరి పండించేందుకు వీలవుతుంది. అలాంటి ప్రాంతాలు ఏవీ … అంటే… డెల్టా ప్రాంతాలైన గుంటూరు, కృష్ణ, గోదావరి లాంటి నీటి లభ్యత ఎక్కువగా ఉండే ప్రాంతాలు. ఈ ప్రాంతాలని ఇప్పుడు Rice bowl of India అంటున్నారు.
మెట్ట ప్రాంతాల్లో అయితే చిన్న చిన్న చెలకల్లో వరి పండిస్తారు. అది నీటి లభ్యతను బట్టి సాగు విస్తీర్ణం ఉంటుంది. డెల్టా ప్రాంతాల్లో ఉన్నంత విస్తీర్ణంలో ఉండదు. మెట్ట ప్రాంతాల్లో వర్షాధార పంటలు మాత్రమే వేస్తారు. వర్షాధార పంటలంటే పెద్దగా నీటి అవసరం లేని పంటలు. వర్షాలు సరిగా కురిస్తే పంట ఉంటుంది లేకుంటే ఎండుతుంది. ప్రస్తుతం ఉన్న నీటి పారుదల వసతుల వలన సాగు విస్తీర్ణం,దిగుబడీ పెరిగి తెలంగాణ కూడా మరో Rice bowl of India గా మారింది.
రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు వగైరాలు వర్షాధార పంటలు. ఇవే మెట్ట ప్రాంతాల వాళ్ళు తినేవారు. మెట్ట ప్రాంతాలైన తెలంగాణా రాయలసీమ స్పెషల్ వంటకాలని జొన్న రొట్టెలు, రాగి జావ, రాగి ముద్ద వంటివాటినే కదా చెప్తారు.
ఇక జపాన్ పొట్టి వరి వంగడాన్నీ, తైవాన్ వంగడాన్నీ కలిపి సృష్టించిన ఐఆర్-8 అనే వంగడం ఎక్కువ దిగుబడి ఇవ్వడం… బోరు పంపుల క్రింద వరి సాగు చేయడం వల్ల లభ్యత కూడా పెరిగిందని చెప్పవచ్చు. అప్పట్లో మన పూర్వీకులు చిరు ధాన్యాలనే ఎక్కువగా తినేవారు. వరి అన్నాన్ని ఎప్పుడో పండగలకు మాత్రమే తినేవారు. అందువల్లే వారు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. కాబట్టే ప్రముఖ డాక్టర్ ఖాదర్ వలీ చిరు ధాన్యాలను తినాలని చెబుతుంటారు. కానీ మనం మాత్రం అన్నం తింటూ అనేక రోగాలను కొని తెచ్చుకుంటున్నాం.