గాలి పీల్చకుండా కొన్ని నిమిషాల పాటు మీరు ఉండగలరా..? అది అస్సలు సాధ్యం కాదు కదా..! అవును, అలా సాధ్యం అయ్యే పని కాదు. కొన్ని నిమిషాలు కాదు కదా, ఒక్క నిమిషం కూడా గాలి పీల్చకుండా సరిగ్గా ఉండలేం. అందుకే గాలిని, ముఖ్యంగా ఆక్సిజన్ ను ప్రాణవాయువు అన్నారు. మన ప్రాణానికి ఆధారం అదే. మనకే కాదు, సృష్టిలో జీవం ఉన్న ప్రతి ప్రాణికి ఆక్సిజన్ కావల్సిందే. లేనిదే వాటి మనుగడ లేదు. అయితే ఆక్సిజన్ విషయానికి వస్తే మీకో విషయం తెలుసా..? మనం మన జీవితం కాలంలో ఎంత ఆక్సిజన్‌ను పీల్చుకుంటామో. దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతి మనిషి సగటున రోజుకు పీల్చుకునే ఆక్సిజన్ పరిమాణం ఎంతంటే… అది 3 సిలిండర్లకు సమానం. అవును, మీరు విన్నది కరెక్టే. ఇది మేం చెబుతోంది కాదు, సైంటిస్టులు చెబుతున్న నిజం. ఈ లెక్కన తీసుకుంటే ఒక్కో ఆక్సిజన్ సిలిండర్‌కు రూ.700 ధర అవుతుంది. అంటే మనం రోజూ 3 x 700 = రూ.2100 విలువైన ఆక్సిజన్‌ను పీల్చుకుంటున్నట్టు లెక్క. ఇక సంవత్సరానికి లెక్క వేస్తే 365 x 2100 = రూ.7.66 లక్షలు అవుతుంది. అంటే అంత మొత్తం విలువైన ఆక్సిజన్‌ను మనం ఏడాదిలో పీల్చుకుంటామన్నమాట.
ఇక మనిషి సగటు వయస్సు 65 సంవత్సరాలు అనుకుంటే అప్పుడు 65 ఏళ్ల పాటు మనం పీల్చుకునే ఆక్సిజన్ విలువ రూ.5 కోట్లకు పైగానే అవుతుంది. అంటే ఒక మనిషి తన జీవిత కాలంలో పీల్చుకునే ఆక్సిజన్‌ను కొనుగోలు చేయాలంటే అందుకు రూ.5 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. చూశారా… మనం పీల్చుకునే ఆక్సిజన్ ఎంత విలువైందో. కానీ మనం ఏం చేస్తున్నాం..? అలాంటి ప్రాణవాయువును ఇచ్చే చెట్లను నరికివేస్తున్నాం. అడవులను ధ్వంసం చేస్తున్నాం. ఇకనైనా మేల్కొనకపోతే భవిష్యత్తులో నిజంగానే మనం అలా ఏటా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆక్సిజన్‌ను కొనుగోలు చేయాల్సి వస్తుందేమో కదా..!