వాళ్ళు తేడా అని తెలిసినా, వదిలే ధైర్యం లేక.. మనసుకి తప్పని తెలుసుకున్నా, కొన్ని సంబంధాలను తప్పక కొనసాగిస్తారు. నేను ఇంకా ప్రేమిస్తే, ఇంకొన్ని త్యాగాలు చేస్తే, ఇంకాస్త కష్టపడితే, వారు కూడా నన్ను ప్రేమిస్తారని నమ్ముకుంటారు. వారి ప్రేమను పొందడానికే జీవితం ఖర్చై పోతుంది కొందరి విషయంలో.. కానీ నిజం ఏమిటంటే.. ఎంత ప్రయత్నించినా, ఎదుటివారు మారదలచుకోకపోతే, మన ప్రయత్నం వృథా. వారు మనం కోరిన మార్పును అంగీకరించకపోతే, బాధపడుతూ ఆ సంబంధంలో మనం ఎందుకు ఉండాలి? ఒక సంబంధం కంటే మీ మానసిక ఆరోగ్యం ముఖ్యమైనది!
మీ జీవితంలో బాధ ఎక్కువగా ఉంటే, ఆనందం తక్కువైతే, అప్పుడు ఆ సంబంధాన్ని విడిచిపెట్టాల్సిన సమయం వచ్చేసింది అని అర్థం. నిజాన్ని అంగీకరించడం – మన హృదయాన్ని మరింత బాధ నుంచి కాపాడుకోవడానికి ఇది అవసరం. అనేక మంది ఇంకోసారి ప్రయత్నిస్తే మారతారు అనే నమ్మకంతో నిజాన్ని ఎదుర్కోవడానికి భయపడతారు. కానీ ఉదాసీనతతో కూడిన ఒక సంబంధాన్ని మీకున్నఆశ ఒక్కటే నిలబెట్టలేదు. పీడించే సంబంధం నుంచి బయటపడకపోతే, మనమే మనకు ఆపద తెచ్చుకున్నట్టు గుర్తుంచుకోండి.
ఎవరూ మీ ఆనందాన్ని హరించలేరు – మీరు అనుమతిస్తే తప్ప. మీ ఆనందం మీ చేతుల్లో ఉంది – దీనికోసం మరొకరిపై ఆధారపడాల్సిన అవసరం లేదు. మీరు ఇతరుల గౌరవానికి, ప్రేమకు, దయకు అర్హులు! వీటిని మీ జీవితంలో అందించని వ్యక్తిని విడిచిపెట్టి, మీ మనఃశాంతిని కాపాడుకోండి. మీరు ఏదైనా సంబంధంలో లోతుగా మునిగి ఉన్నారా? అది బాధ పెడుతోందా? మీకు మీరు వేసుకోవాల్సిన అసలు ప్రశ్న ఇది :
ఈ సంబంధంలో మీరు ఉన్నంతకాలం, నిజమైన ప్రేమను, గౌరవాన్ని, ఆనందాన్ని పొందగలరా ? లేదా… భవిష్యత్తులో అవతలి వారు మారుతారని ఆశించుకుంటూ ప్రస్తుతం బాధ పడుతున్నారా?