గర్భం దాల్చిన మహిళల్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో అందరికీ తెలిసిందే. అలాంటి వారికి ఎక్కువగా వాంతులు అవుతుంటాయి. వికారంగా ఉంటుంది. తల తిరిగినట్టు అనిపిస్తుంది. వారి వక్షోజాల్లో కూడా మార్పులు వస్తాయి. ఇంకా అనేక మార్పులు కూడా గర్భిణీ స్త్రీలలో కనిపిస్తాయి. అయితే అవే కాదు, పలు విచిత్రమైన లక్షణాలు కూడా కొందరు మహిళల్లో కనిపిస్తాయట. అవును, మీరు విన్నది కరెక్టే. ఇంతకీ ఆ లక్షణాలు ఏమిటో తెలుసా..? వాటి గురించే ఇప్పుడు తెలుసుకుందాం. గర్భిణీలకు పీరియడ్స్ రావు. అయితే గర్భం దాల్చిన మహిళల్లో పిండం గర్భాశయ గోడలకు అతుక్కునే క్రమంలో కొందరు మహిళల్లో రక్త స్రావం అవుతుంది. దీన్ని చూసి కొందరు మహిళలు పీరియడ్స్ అని భ్రమిస్తారు. కానీ అవి పీరియడ్స్ కావు. వైద్యున్ని సంప్రదిస్తే ఆ విషయంలో క్లారిటీ వస్తుంది. సాధారణంగా ఈ రక్త స్రావం అనేది కూడా అందరు మహిళల్లో జరగదట. అలా కేవలం 30 శాతం మందిలోనే జరుగుతుందట.
గర్భం దాల్చిన మహిళలకు శరీరంలో ఎక్కడైనా నల్లని మచ్చలు ఏర్పడుతాయి. అయితే అది హార్మోన్ల ప్రభావం వల్లే అలా జరుగుతుంది. డెలివరీ అయ్యాక అవి చర్మం రంగులో కలసిపోతాయి. మహిళలు గర్భం దాల్చినప్పుడు మొదటి మూడు నెలల కాలంలో వారికి ఉమ్మి ఎక్కువగా వస్తుంది. వికారం, వాంతులే అందుకు కారణం. అలాంటి వారు చ్యూయింగ్ గమ్‌లను నమిలితే ఫలితం ఉంటుంది. గర్భం దాల్చిన మహిళలకు జుట్టు కూడా ఎక్కువగానే పెరుగుతుందట. కొందరిలోనైతే జననావయవాల దగ్గర, తొడల మీద కూడా వెంట్రుకలు ఎక్కువగా పెరుగుతాయట. హార్మోన్ల వల్లే అలా జరుగుతుంది.
అంతకు ముందు వరకు అంతగా ఆకట్టుకోని కంఠ స్వరం ఉన్న మహిళలు కూడా గర్భం దాల్చితే వారి కంఠ స్వరం అద్భుతంగా మారుతుందట. గర్భం దాల్చిన మహిళల్లో కొందరికి చర్మంపై దురదలు వస్తూనే ఉంటాయట. చర్మం కందిపోయి ఎర్రగా మారుతుందట. అయితే దాంతో ప్రమాదమేమీ ఉండదు. మరీ తీవ్రతరమైతే డాక్టర్‌ను సంప్రదించాలి. గర్భం దాల్చిన మహిళల్లో కొందరికి దృష్టి సంబంధ సమస్యలు వస్తాయట. అయితే అవి తాత్కాలికమే. డెలివరీ అయ్యాక చూపు నార్మల్ అవుతుందట. గర్భం దాల్చిన మహిళల్లో సహజంగానే రక్త సరఫరా పెరుగుతుంది. దీంతో దంతాలు తోముకునేటప్పుడు లేదంటే చిగుళ్లకు చేతి వేళ్లు, గోర్లు తాకినా వెంటనే రక్త స్రావం అవుతుంది. అయితే అలాంటి స్థితిలో గాయం మరీ ఎక్కువైతే వైద్యున్ని సంప్రదించాలి.