Majjiga: భారతీయులు చాలా మంది రోజూ భోజనం చివర్లో పెరుగు లేదా మజ్జిగను తీసుకుంటుంటారు. ఉత్తరాది వారు అయితే మజ్జిగలో చక్కెర కలిపి లస్సీ అని చెప్పి తాగుతారు. అదే దక్షిణ భారతదేశం వారు అయితే మజ్జిగను అన్నంలో కలుపుకుని తింటారు. లేదా పెరుగును కూడా అలాగే తింటారు. ఇక మజ్జిగలో నిజానికి 10 రకాల మజ్జిగలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ మజ్జిగను ప్రత్యేకంగా తయారు చేస్తారు. పేరుకుపోయిన పాలలో నీరు కలపరు. అలాగే చిలికి మజ్జిగను తయారు చేస్తారు. దీన్నే మదితము అని పిలుస్తారు. ఇది చాలా చిక్కగా, జిడ్డుగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల జీర్ణ రోగాలు తగ్గుతాయి. పైత్యం తగ్గుతుంది. రుచి లేని వారికి రుచి వస్తుంది. నీరసం ఉండదు. విరేచనాలు తగ్గుతాయి. శరీరానికి బలం కలుగుతుంది.
పెరుగు ఒక వంతు.. నీళ్ళు మూడు వంతులు పోసి చిలికి తయారు చేసే మజ్జిగను మిలితము అంటారు. దీంతో పైత్యం, అతిసారం, విరేచనాలు, వాతం తగ్గుతాయి.
ఒక వంతు పెరుగు, ఒకటిన్నర వంతు నీరు కలిపి తయారు చేసే మజ్జిగను గోళము అంటారు. దీంతో వీర్య వృద్ది కలుగుతుంది. శరీరానికి కాంతి వస్తుంది. కళ్ళకు మేలు జరుగుతుంది. జీర్ణాశయంలో దోషాలు పోతాయి. జీర్ణ సమస్యలు తగ్గుతాయి.
ఒక వంతు పెరుగు అయిదు వంతుల నీళ్ళు కలిపి తయారు చేసే మజ్జిగను షాడభము అని పిలుస్తారు. దీంతో శ్లేష్మ రోగాలు తగ్గుతాయి. అంటే ఊపిరితిత్తుల్లో ఉండే మ్యూకస్ కరుగుతుంది. జీర్ణం బాగా అవుతుంది.
ఒక వంతు పెరుగు రెండు వంతుల నీళ్ళు కలిపి తయారు చేసే మజ్జిగను కాలేశేయము అంటారు. దీంతో బంక విరేచనాలు తగ్గుతాయి. శరీరంలో ఉండే విష పదార్థాలు బయటకు పోతాయి. వాపులు, మంటలు తగ్గుతాయి.
పెరుగు, నీళ్ళు సమానంగా కలిపి చిలికి తయారు చేసే మజ్జిగను కరమదితము అంటారు. ఈ మజ్జిగ వగరుగా, పుల్లగా, రుచికరంగా ఉంటుంది. దీంతో అజీర్ణ సమస్య తగ్గుతుంది. జలుబు, కామెర్లు, శ్లేష్మం తగ్గుతాయి. వీర్యం వృద్ధి చెందుతుంది. బలాన్ని అందిస్తుంది.
పెరుగులో నాలుగవ వంతు నీళ్ళు పోసి చిలికి తయారు చేసే మజ్జిగను ఉదాస్వితము అంటారు. ఇది దెబ్బలు, వాతాలు, విరేచనాలు, తలతిరగడం వంటి సమస్యలను తగ్గిస్తుంది.
పెరుగులో సగం వంతు నీళ్ళు కలిపి చిలికి తయారు చేసే మజ్జిగను తక్రమ అంటారు. దీంతో పాండు రోగము, వాపులు, వాతం, కడుపులో బల్లలు, ఫిస్టులా, జీర్ణ సమస్యలు తగ్గుతాయి. దీంట్లో శొంఠి, పిప్పళ్ల చూర్ణం, మిరియాలు, ఉసిరిక పప్పు వంటి చూర్ణాలను కలిపి తాగితే మంచిది.
ఒక వంతు పెరుగు రెండు వంతుల నీళ్ళు పోసి చిలికి తయారు చేసే మజ్జిగను దండ హతము అంటారు. దీంతో శరీరంలో ఉండే అతి వేడి తగ్గుతుంది. శ్లేష్మం కరుగుతుంది. ఆహారం బాగా జీర్ణం అవుతుంది.
ఒక వంతు పెరుగు తొమ్మిది వంతుల నీళ్ళు పోసి చిలికి తయారు చేసే మజ్జిగను అతి మీలితము అంటారు. దీంతో జీర్ణ సమస్యలు తగ్గుతాయి.