హీరోయిన్ ప్లాస్టిక్ సంచిలో బీర్లు తీసుకువెళ్తుంటే అది చూసిన హీరో ఆ కవర్ దేశంలో బ్యాన్ చేసిన కూడా అమ్మేస్తున్నారా? అది 20 మైక్రాన్ కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ సంచి అని, దానివల్ల పర్యావరణానికి ఎంత హాని కలుగుతుందో తెలుసా అని షాప్ వాడితో గొడవకి దిగుతాడు. అసలు ఏమిటీ ప్లాస్టిక్ సంచి మైక్రాన్??? ప్లాస్టిక్ సంచి మందం కొలత యూనిట్ మైక్రాన్, ఒక మైక్రాన్ అంటే మిల్లిమీటర్ లో వెయ్యో వంతుతో సమానం (1 మిల్లిమీటర్ = 1000 మైక్రాన్స్). ప్లాస్టిక్ ఎన్ని మైక్రాన్ల మందంగా ఉందో తెలుసుకోవడానికి మైక్రోమీటర్ అనే ప్రత్యేక సాధనం కొలవడానికి ఉపయోగిస్తారు. µm అనేది మైక్రోమీటర్ల కొలతకు చిహ్నం, దీనిని మైక్రాన్‌లుగా కూడా సూచిస్తారు. ప్లాస్టిక్ సంచుల మందం దాని బలాన్ని నిర్ణయిస్తుంది. ప్లాస్టిక్ ఎంత మందంగా ఉంటే దాని ధర అంత ఎక్కువగా ఉంటుంది. ప్లాస్టిక్ సంచి ఎంత సన్నగా ఉంటే పర్యావరణానికి అంత హానికరం.
ఈ ఒక్కసారి ఉపయోగించి పడేసే ప్లాస్టిక్ అంతా డీకంపోజ్ అవ్వటానికి వేల సంవత్సరాలు పడుతుంది. అవి అలానే చిన్న చిన్న ముక్కలుగా మట్టిలో ఉండిపోవటం చేత భూసారాన్ని కూడా ప్రభావితం చేస్తాయి, వాటిని జంతువులు, సముద్రంలో చేపలు కూడా తేలికగా తినేస్తాయి, అవి మన ఆహార గొలుసులోకే ప్రవేశిస్తాయి. ప్లాస్టిక్ వల్ల ఇంత హాని ఉంది కాబట్టే ప్లాస్టిక్ మందం విషయంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త నిర్ణయాలు తీసుకుంటుంది. ప్లాస్టిక్ వాడటం మనం ఎలాగూ మానం కాబట్టి తక్కువ మందం ఉండే ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ ని బ్యాన్ చేస్తుంది. ఇలా చేస్తే కనీసం ఎక్కువ మందం ఉండే ప్లాస్టిక్ సంచులు కొంటాం, అవి వాడిపడేయకుండా ఎక్కువ కాలం వాడుకుంటాం కనుక చిన్న ముక్కలుగా సులభంగా విచ్ఛిన్నం కాదు, తద్వారా ఆహార గొలుసులోకి ప్రవేశించడానికి మట్టితో కలవడం నివారించబడుతుంది. ఎంతోకొంత పర్యావరణానికి మేలు చేసిన వాళ్ళం అవుతాం.
ఈ ప్లాస్టిక్ వ్యర్దాల నిబంధనలు కాలాన్ని బట్టి మారుతూ వచ్చాయి. 1999 లో కనీస మందం 20 మైక్రాన్ల గాను, 2011 నాటికీ 40 మైక్రాన్లగాను నిబంధన వచ్చింది. జనతా గ్యారేజ్ సినిమా 2016 లో వచ్చింది, అప్పటికే 20 మైక్రాన్ల సంచులు బ్యాన్ అయినవి కాబట్టి హీరో షాప్ వాడితో ఎందుకు అమ్ముతున్నారు అని ప్రశ్నిస్తాడు. ప్రస్తుతం సింగల్ టైం వాడే ప్లాస్టిక్ పూర్తిగా బ్యాన్ చేసారు. ఇలా మెల్ల మెల్లగా ప్లాస్టిక్ సంచి మందం 40 నుండి 50 కి, 50 నుండి 75 కి, జనవరి 1, 2023 నుండి, ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాల నిర్వహణ సవరణ నిబంధనలు, 2021 ప్రకారం, ప్లాస్టిక్ బ్యాగ్ మందం 120 మైక్రాన్‌లకు సవరించబడింది. ఇలా మందం పెంచుకుంటూ పోవటం వల్ల, కొంతలో కొంత మున్సిపాలిటీ కార్మికులకు ఈ చిన్న చిన్న ప్లాస్టిక్ ముక్కలని వెతికివెతికి పక్కకి తీసే పని తగ్గుతుంది. అలాగే ఎక్కువ మందం అంటే ఎక్కువ సార్లు వాడుకోవచ్చు పైగా ఎక్కువ ధర ఉంటుంది కాబట్టి మెల్లగా జనం కూడా ప్లాస్టిక్ ప్రత్యామ్నాయం వాడతారు అని ఉద్దేశం.
ఇలా ఎన్ని చెప్పుకున్న ఇవన్నీ మూణ్ణాళ్ళ ముచ్చట్లు గానే ఉండిపోతాయి, బ్యాన్ అన్నారు గట్టిగా వారం కూడా లేరు మళ్ళి ప్లాస్టిక్ సంచులు షాప్ లో వాళ్ళు ఇచ్చేస్తున్నారు, జనాలు యధావిదిగా వాడేస్తున్నారు. నేను ఏమి ఉత్తముడుని అని చెప్పట్లేదు నేను కూడా ప్లాస్టిక్ వాడుతున్నాను కానీ పైన చెప్పిన ఆ పల్చటి వాడి పడేసేవి మానేసాను. మందంగా ఉండేవి, పెద్దవి, మళ్ళి మళ్ళి వాడుకునేలా ఉన్నవాటినే వాడుతున్నాను. మీలో ఎవరైనా ఆ పల్చటివి ఇంకా వాడుతుంటే ఇకనుండి మానేయాలని కోరుకుంటున్నాను. అలానే మీ పాల ప్యాకెట్లు లేదా ఇతర ప్యాకెట్లు కత్తిరించేటపుప్డుడు చిన్న ముక్కలు వచ్చేటట్టు కట్ చేసి పడెయ్యకండి, ఆ ముక్కలని రీసైకిల్ చేయలేరు, మనం తెలిసి తెలియక చేసే తప్పుకి ఆ చిన్న ముక్కలని మిగతా జీవరాసులు తినేసి ఇబ్బంది పడుతున్నాయి, అలా ప్లాస్టిక్ తిన్న జంతువులని తిరిగి తింటున్న మనం కూడా పరోక్షంగా ఆ ప్లాస్టిక్ ని తింటున్నట్టే.