Heat In Body : వేసవి కాలంలో వచ్చే సమస్యలలో మన శరీరంలో వేడి చేయడం ఒకటి. మనలో కొందరు గోధుమ పిండితో చేసిన పదార్థాలు, తేనె, మామిడి పండ్లు, బొప్పాయి కాయ, గోంగూర, ఆవకాయ వంటి వాటిని తినడం వల్ల శరీరంలో వేడి చేయడం వంటిది జరుగుతుందని అంటుంటారు. కానీ ఇది అంతా అవాస్తవమని నిపుణులు చెబుతున్నారు. మన శరీరంలో నిరంతరం కణజాలం నుండి శక్తి ఉత్పత్తి అవుతూ ఉంటుంది. శక్తి ఉత్పత్తి అవ్వడం వల్ల వచ్చే వేడి (ఉష్ణోగ్రత) మన శరీరంలో సాధారణంగా 98.4 డిగ్రీల ఫారెన్‌హీట్ వరకు ఉంటుంది.
కణజాలంలో ఉండే నీరు ఈ ఉష్ణోగ్రతను పెరగకుండా, తగ్గకుండా నియంత్రిస్తుంది. మనం నీటిని సరిగ్గా తాగనప్పుడు కణజాలంలో ఉండే నీటి శాతం తగ్గి శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఈ స్థితినే వేడి చేయడం అంటారు. కళ్లమంటలు, తలనొప్పి, మూత్రంలో మంట, శరీరానికి వేడి తగిలినప్పుడు శరీరం మండినట్టు అనిపించడం, మూత్రం వేడిగా రావడం వంటి లక్షణాలు.. శరీరంలో వేడి చేసినప్పుడు మనం చూడవచ్చు.
శరీరంలో వేడి చేసినప్పుడు ఎక్కువగా పంచదార నీళ్లను, సగ్గు బియ్యం పాయసాన్ని, నిమ్మ కాయ నీళ్లను, శీతల పానీయాలను ఎక్కువగా తాగుతూ ఉంటారు. ఇవి నీటిని ఎక్కువగా కలిగిన ఆహార పదార్థాలు మాత్రమే. కానీ నీరు కాదు. కనుక శరీరంలో వేడి చేసినప్పుడు వీటిని తాగడం కంటే నీళ్లను తాగడం వల్లే శరీరంలో వేడి త్వరగా తగ్గుతుంది. నీళ్లు చాలా త్వరగా జీర్ణమయ్యి వెంటనే రక్తంలో కలుస్తాయి. నీరు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఇవి జీర్ణమవ్వటానికి సుమారుగా 2 గంటల సమయం పడుతుంది. ఈ ఆహార పదార్థాలలో ఉండే నీరు రక్తంలో కలవడానికి సమయం ఎక్కువగా పడుతుంది. కనుక మనం నీటినే ఎక్కువగా తాగాలి.
మన శరీరానికి 70 శాతం నీళ్లు, 30 శాతం ఆహార పదార్థాలు అవసరం అవుతాయి. కనుక రోజుకి కనీసం 4 లీటర్ల నీటిని తాగాలి. వేసవి కాలంలో ఒక రోజుకి కనీసం 5 లీటర్ల నీటిని తాగాలి. ఇలా తాగడం వల్ల శరీరంలో వేడి చేయడం జరగదు. వేడి చేసిన వారు లేదా వేడి చేయకుండా ఉండడానికి ఉదయం పరగడుపున లీటర్ నుండి లీటర్నర నీళ్లను తాగాలి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసేటప్పుడు నీటిని తాగకుండా బ్రేక్ ఫాస్ట్ చేసిన తరువాత ఒక గంట నుండి మధ్యాహ్న భోజనానికి మధ్యలో 3 నుండి 4 గ్లాసుల నీళ్లను తాగాలి. ఇలా చేయడం వల్ల తాగిన నీరు వెంటనే రక్తంలో కలుస్తుంది.
భోజనం చేసిన తరువాత 2 గంటల నుండి మళ్లీ నీటిని తాగడం ప్రారంభించాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది. ఇలా నీటిని తాగుతూ ఎటువంటి ఆహార పదార్థాలను తిన్నా.. శరీరంలో వేడి చెయ్యదు.. అని నిపుణులు తెలియజేస్తున్నారు.