Holding Sneeze : సాధారణంగా మనకు సీజన్లు మారినప్పుడు దగ్గు, జలుబు, ముక్కు దిబ్బడ వంటి సమస్యలు వస్తుంటాయి. అయితే కొందరికి ఇవి ఎల్లప్పుడూ ఉంటాయి. ఇక ఈ సమస్యలు ఉన్నప్పుడు సహజంగానే ఎవరికైనా సరే తుమ్ములు కామన్‌గా వస్తాయి. అలాగే కొందరికి దగ్గు, జలుబు లేకపోయినా తుమ్ములు అనేవి సహజంగానే వస్తుంటాయి. దుమ్ముకు అలర్జీ ఉన్నా, ఇతర కారణాల వల్ల, లేదా పుప్పొడి రేణువులను పీల్చినా కూడా తుమ్ములు వస్తుంటాయి. అలాగే కొందరికి భోజనం చేసేటప్పుడు తుమ్ములు వస్తుంటాయి. అయితే నలుగురిలో ఉన్నప్పుడు తుమ్ములు వస్తే మాత్రం చాలా మంది వాటిని ఆపుతుంటారు. అయితే ఇలా తుమ్ములను ఆపడం ప్రమాదకరమని.. దాంతో తీవ్ర దుష్పరిణామాలు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు. తుమ్ములు వస్తే తుమ్మాలి కానీ ఆపితే ప్రమాదకరం అవుతుందని అంటున్నారు. తుమ్ములను ఆపడం వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
తుమ్ములను ఆపడం వల్ల అనేక అనర్థాలు సంభవించేందుకు అవకాశాలు ఉంటాయి. సాధారణంగా మనం తుమ్మినప్పుడు మన చెవులు, నోరు, ముక్కు, కళ్లపై కొంత పీడనం ఏర్పడుతుంది. తుమ్మగానే అది బయటకు వెళ్లిపోతుంది. అయితే ఎప్పుడైతే తుమ్మును ఆపేస్తామో అప్పుడు ఆ పీడనం బయటకు పోదు. దీంతో చెవులు, కళ్లు, ముక్కు, నోరు ప్రాంతాల్లో ఉండే కణాలు, రక్తనాళాలపై ఒత్తిడి పడుతుంది.అప్పుడు అవి పగిలిపోయే అవకాశాలు ఉంటాయి. దీంతో ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడుతాయి. కనుక తుమ్మును ఎట్టి పరిస్థితిలోనూ ఆపరాదు.
ఇక తుమ్మును ఆపడం వల్ల చెవుల్లో ఉండే కర్ణభేరి దెబ్బ తినేందుకు అవకాశాలు ఉంటాయి. అలాగే ఊపిరితిత్తులపై ఒత్తిడి పడుతుంది. దీంతో అవి సరిగ్గా పనిచేసే అవకాశాలు తగ్గుతాయి. ఇక మన శరీరంలోకి ముక్కు ద్వారా బాక్టీరియా, వైరస్‌లు ప్రవేశించినప్పుడు కూడా శరీరం సహజంగానే రక్షణ వ్యవస్థను అలర్ట్ చేస్తుంది. దీంతో తుమ్ము ద్వారా క్రిములు ముక్కు నుంచి బయటకు వెళ్లిపోతాయి. దీని వల్ల ఇన్‌ఫెక్షన్లు రావు. అయితే తుమ్మును ఆపితే ఆ క్రిములు శరీరంలోకి చేరుతాయి. దీంతో ఇన్‌ఫెక్షన్లు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక తుమ్మును ఎట్టి పరిస్థితిలోనూ ఆపరాదు.
తుమ్మును ఆపడం వల్ల పక్కటెముకలపై కూడా ఒత్తిడి పడుతుంది. దీంతో కొన్ని సందర్భాల్లో అవి విరిగేందుకు కూడా అవకాశాలు ఉంటాయి. అలాగే మెదడులోని కణాలపై కూడా ఒత్తిడి పడుతుంది. దీంతో మెదడులో వాపులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే గొంతుకు కూడా నష్టం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కనుక ఎక్కడ ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే తుమ్మును ఎట్టి పరిస్థితిలోనూ ఆపరాదని.. ఆపితే అనర్థాలను కొని తెచ్చుకున్న వారమవుతామని.. నిపుణులు చెబుతున్నారు. కాబట్టి తుమ్మును ఆపకండి. తుమ్ము వస్తే తుమ్మండి. అందులో సిగ్గు పడాల్సిన అవసరం లేదు.