గుండె ఒక బోలుగా వుండి, కోన్ ఆకారంలో వుండే కండరం. ఇది ఊపిరితిత్తులకు, ఛాతీ ముందుభాగ ఎముకకు మధ్య నుంటుంది. ఛాతీలో మధ్య నుండి ఎడమవైపుకు అధికంగాను, కుడివైపుకు కొద్దిపాటిగాను విస్తరించివుంటుంది. గుండె ధ్వనులు ఎలా వుంటాయి? వైద్యుల వద్ద వుండే స్టెతస్కోప్ అనే పరికరంతో గుండె ధ్వనిని వింటే అది లబ్ డబ్ అనే ధ్వని చేయటంగా వినపడుతుంది.
లబ్ అనే మొదటి ధ్వని రక్తం చిమ్మేదిగాను, డబ్ అనే ధ్వని గుండె వాల్వులు మూసుకోవడం లేదా తెరుచుకోవడంకు సంబంధించినవిగా చెపుతారు. గుండె ప్రధానభాగం పొడవు 12 సెం.మీ. వెడల్పు 8 – 9 సెం.మీ. ముందునుండి వెనుకకు అంటే మందం 6 సెం.మీ. గాను వుండి షుమారుగా మీ పిడికిలి పరిమాణంలో వుంటుంది.
మహిళల గుండె సగటు బరువు 9 ఔన్సులు, పురుషుల గుండె సగటు బరువు 10.5 ఔన్సులు వుంటుంది. మొత్తం శరీర బరువులో గుండె బరువు 0.5 శాతంగా వుంటుంది. గుండెలో మూడు భాగాలుంటాయి. మెత్తనైనది అంటే గుండె లోపలి లైనింగ్ వంటిది. దీనిని ఎండో కార్డియం అంటారు. మధ్య భాగం కండరం, దీనిని మయోకార్డియం అంటారు. దీని చుట్టూ ఒక ద్రవం నిండిన సంచి వుంటుంది. దీనిని పెరికార్డియం అంటారు.