శరీరంలోని అన్ని అవయవాలలోకంటే గుండె అతి ప్రధానమైన అవయవమని అందరికి తెలిసిందే. గుండె లేకుండా మనం జీవించలేము. అయితే, అసలు గుండె అనేది ఏమిటని పరిశీలిస్తే అది ఒక పంపు లేదా పంపిణీ చేసే అవయవం వంటిదని చెప్పచ్చు. ఎంతో సంక్లిష్టమైంది, ప్రధానమైంది అయినప్పటికి అది ఒక పంపు వంటిదే. సాధారణంగా పంపులన్ని అడ్డుపడటాలు, పనికిరాకుండాపోవడాలు, రిపేర్లు రావటం వంటివి కలిగి వుంటాయి. అయితే, మన గుండె విషయంలో కూడా ఇదే పరిస్ధితి వుంటుంది. కనుక రక్తాన్ని పంప్ చేస్ ఈ గుండె గురించి దాని పనితనాన్ని గురించి తెలుసుకోవడం ముఖ్యం.
గుండె గురించిన సమాచారం, దానికి ఏది మంచి ఏది చెడు అనేవి కూలంకషంగా తెలుసుకొని వుంటే మీకు వచ్చే గుండె సంబంధిత వ్యాధులను తగ్గించుకునే అవకాశం కూడా వుంటుంది. అనేక చోట్ల మనం గుండెను హృదయమనే మాటలో వాడి ఎంతో అపురూపంగా దానిని వర్ణిస్తూంటాము. శరీరంలోని ఏ అవయవం కూడా ఇంత ప్రాధాన్యతను మానసికంగా సంతరించుకోలేదు. ఎంతో అభివృద్ధి చెందిన అమెరికా దేశంలో మరణాలకు గుండె జబ్బులు ప్రధానకారణంగా చెపుతున్నారు.
ప్రతిరోజూ గుండె సంబంధిత వ్యాధులు లేదా పోట్లు వంటి వాటితో సుమారు 2,000 మంది అమెరికన్లు మరణిస్తున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. అంటే ప్రతి 44 సెకండ్లకు ఒక మరణం కలుగుతోంది. అయితే, ఇటీవలికాలంలో కొంత వరకు గుండెజబ్బుల కారణంగా సంభవించే మరణాలు తక్కువగా వున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికి గుండెకు వ్యాధులు వస్తే చాలావరకు ఆకస్మిక మరణాలే సంభవిస్తున్నాయి. రోగులు హాస్పిటల్ చేరేటంతవరకు కూడా వ్యవధిలేక మరణిస్తూంటారు. మానసికంగా గుండెకు ఒక ప్రత్యేక స్ధానం వుంది.