Pregnancy Symptoms : మాతృత్వం అనేది మహిళలకు లభించిన గొప్ప వరం అనే చెప్పవచ్చు. ఒక బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. స్త్రీగా పరిపూర్ణత్వం సాధిస్తుందని చెబుతుంటారు. అయితే ఆ మాట పక్కన పెడితే.. పిల్లల కోసం దంపతులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. కానీ కొందరు దంపతులకు మాత్రం అది కలగానే మిగిలిపోతుంది. అయితే మొదటి సారి తల్లి అయిన మహిళకు ఎంతో సంతోషంగా ఉంటుంది. చిన్న పాప లేదా బాబు తమ కుటుంబంలోకి ఎప్పుడు వస్తారా.. అని ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలోనే తల్లి అయిన వారికి పలు లక్షణాలు కూడా తెలుస్తుంటాయి. కానీ తాము గర్భం ధరించిందీ.. లేనిదీ.. పరీక్షల ద్వారా మాత్రమే తెలుస్తుంది. అయితే గర్భం వచ్చినప్పుడు ఆరంభంలో పలు లక్షణాలు ఉంటాయి. వాటిని గుర్తించడం ద్వారా గర్భం ధరించిందీ.. లేనిదీ.. సులభంగా తెలుసుకోవచ్చు. ఇక మహిళలు గర్భం ధరించినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా గర్భం ధరించిన మహిళలు పీరియడ్స్ మిస్ అవుతారు. కొన్ని సార్లు హార్మోన్ల సమస్యలు, ఇతర కారణాల వల్ల కూడా పీరియడ్స్ మిస్ అవుతాయి. కానీ గర్భం ధరిస్తే మాత్రం కచ్చితంగా పీరియడ్స్ రావు. కనుక ఈ విషయాన్ని గమనిస్తే.. గర్భం ధరించింది.. లేనిది.. ఇట్టే తెలిసిపోతుంది. అలాగే గర్భధారణ మహిళలకు వక్షోజాలు మృదువుగా మారుతాయి. వాపులు కనిపిస్తాయి. క్షీరగ్రంథులు పాలను ఉత్పత్తి చేయడం మొదలు పెడతాయి. కనుక అలా జరుగుతుంది. అలాగే కొందరు స్త్రీలకు గర్భం ధరించినప్పుడు వికారంగా ఉంటుంది. కొందరికి వికారంతోపాటు వాంతులు కూడా అవుతుంటాయి. అయితే కొందరికి నెలలు నిండే కొద్దీ వికారం, వాంతులు తగ్గుతాయి. కానీ కొందరికి మాత్రం బిడ్డ పుట్టే వరకు అవి అలాగే కొనసాగుతాయి. కనుక వారికి ఇబ్బందిగా ఉంటుంది.
గర్భం ధరించిన మహిళలు సాధారణం కన్నా ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకు వెళ్తుంటారు. ఇలా గనక జరుగుతుంటే గర్భం ధరించినట్లు అనుమానించాలి. గర్భం ధరించిన మహిళలు తీవ్ర అలసటకు గురవుతారు. అసలు పని చేయకపోయినా బాగా నీరసంగా, అలసటగా అనిపిస్తుంది. ఇవి గర్భం ధరించారని చెప్పేందుకు ప్రాథమిక సంకేతాలు. అలాగే గర్భధారణ సమయంలో హార్మోన్లు బాగా పనిచేస్తుంటాయి. కనుక మూడ్ మారుతుంది. డిప్రెషన్ వచ్చినట్లు ఉంటారు. లేదా విసుగు చెందుతారు. గర్భధారణ స్త్రీలకు గ్యాస్ ఎక్కువగా వస్తుంది. పొట్టలో నొప్పిగా కూడా ఉంటుంది. మలబద్దకం, పలు రకాల ఆహారాలను తినాలని విపరీతమైన కోరికలు, ముక్కు దిబ్బడ వంటి లక్షణాలు కూడా గర్భం ధరించిన మహిళల్లో కనిపిస్తాయి.
కనుక ఈ లక్షణాలు ఎవరిలో అయినా కనిపిస్తే.. వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. పరీక్షలు చేసి వారు గర్భం ధరించిందీ.. లేనిదీ.. నిర్దారిస్తారు. దాన్ని బట్టి మెడిసిన్లను ఇస్తారు. అయితే హార్మోన్ల సమస్యలు ఉన్నా కొన్ని సార్లు పైన తెలిపిన లక్షణాల్లో కొన్ని కనిపిస్తాయి. కనుక పరీక్షల్లో ఏ విషయం అయిందీ ఇట్టే తెలిసిపోతుంది. అప్పుడు ఒకవేళ హార్మోన్ల సమస్యనే అయితే డాక్టర్ల సూచన మేరకు చికిత్స తీసుకోవచ్చు. దీంతో సమస్యలు తగ్గి గర్భం ధరించే అవకాశాలు మెరుగు పడతాయి.