మన శరీరంలోని కీలకమైన అవయవాల్లో ఊపిరితిత్తులు ఒకటి. మనం పీల్చుకునే గాలిని శుభ్రం చేసి దాన్ని శరీరానికి అందివ్వడంలో ఊపిరితిత్తులు నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంటాయి. ఈ క్రమంలోనే చెడు గాలి బయటకు వస్తుంది. అయితే పలు కారణాల వల్ల కొందరికి ఊపిరితిత్తులు పాడవుతుంటాయి. కానీ ముందుగానే గుర్తించవచ్చు. అలాంటప్పుడు కొన్ని లక్షణాలను శరీరం తెలియజేస్తుంది. వాటిని గమనించడం ద్వారా ఊపిరితిత్తులు పాడైపోయాయని గుర్తించవచ్చు. దీంతో ప్రాణాపాయ స్థితి రాకుండా ముందుగానే జాగ్రత్త వహించవచ్చు. మరి ఊపిరితిత్తులు పాడైతే శరీరంలో కనిపించే ఆ లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. ఊపిరితిత్తులలో సమస్య ఉంటే ఛాతిలో నొప్పి వస్తుంది. ఈ నొప్పి నెల రోజుల వరకు అలాగే ఉంటుంది. తరువాత ఇంకా ఎక్కువ అవుతుంది. అలాగే దగ్గినప్పుడు, శ్వాస తీసుకునేటప్పుడు నొప్పి వస్తుంది. ఈ నొప్పి నెలరోజుల కన్నా ఎక్కువగా ఉంటే అప్పుడు జాగ్రత్త వహించాలి. వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోవాలి.
2. ఊపిరితిత్తులు పాడైనా, సమస్య ఉన్నా శరీరంలో మ్యూకస్ (శ్లేష్మం) ఎక్కువగా ఉత్పత్తి అవుతుంటుంది. కనుక ఈ లక్షణం ఉందేమో గమనించాలి.
3. ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు సడెన్‌గా బరువు తగ్గుతారు. అయితే ఇందుకు పలు ఇతర కారణాలు కూడా ఉంటాయి. కానీ కారణం ఏమిటనేది వైద్య పరీక్షల ద్వారా తెలుస్తుంది. కనుక సడెన్ గా బరువు తగ్గితే ఏమాత్రం నిర్లక్ష్యం చేయరాదు. వెంటనే డాక్టర్‌ను కలవాలి.
4. ఊపిరితిత్తుల్లో సమస్య ఉన్నవారికి శ్వాస సరిగ్గా ఆడదు. శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది.
5. విపరీతంగా దగ్గు వస్తున్నా, దగ్గు ద్వారా రక్తం పడుతున్నా, 8 వారాల కన్నా ఎక్కువగా దగ్గు ఉంటున్నా.. దాన్ని ఊపిరితిత్తుల సమస్యగా భావించాలి. వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకుని అవసరం అయితే చికిత్స తీసుకోవాలి.