మన శరీరంలో ఎర్ర రక్త కణాల సంఖ్య లేదా హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉంటే ఆ స్థితిని అనీమియా అంటారు. అంటే రక్తహీనత అని అర్థం. పురుషుల్లో ఎర్ర రక్త కణాల సంఖ్య 13.5gm/100 ml, స్త్రీలలో ఎర్ర రక్త కణాల సంఖ్య 12 gm/100 ml కన్నా తక్కువ ఉంటే ఆ స్థితిని రక్తహీనత అంటారు. రక్త పరీక్షలు చేయడం ద్వారా ఆ వివరాలు తెలుస్తాయి. ఎర్ర రక్త కణాల ఉత్పత్తి తగ్గినా లేదా ఎర్ర రక్త కణాలు నాశనం అయినా ఆ స్థితి వస్తుంది.
రక్తహీనత సమస్య ఉన్నవారికి తలనొప్పి, తల తిరగడం, శరీరం తెల్లగా పాలిపోయినట్లు కనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
గాయాలు అవడం, సర్జరీలు కావడం, పెద్దపేగు క్యాన్సర్, పోషకాల లోపం (ఐరన్, విటమిన్ బి12, ఫోలేట్), బోన్ మారో సమస్యలు, కిడ్నీ ఫెయిల్యూర్, కీమోథెరపీ మందులను వాడడం, బోన్ క్యాన్సర్, అసాధారణ రీతిలో హిమోగ్లోబిన్ లెవల్స్ ఉండడం, అనీమియా సికిల్ సెల్.. వంటి కారణాల వల్ల రక్తహీనత సమస్య వస్తుంది.
మన శరీరంలో హిమోగ్లోబిన్ లో ఉండే ముఖ్యమైన పోషకాల్లో ఐరన్ ఒకటి. ఇక ఎర్ర రక్త కణాలు మన శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్‌ను రవాణా చేస్తాయి. మన శరీరంలో ఐరన్ తగినంతగా లేకపోతే హిమోగ్లోబిన్ ఉత్పత్తి కాదు. దీంతో అనీమియా (రక్తహీనత) ఏర్పడుతుంది.
రక్తహీనత సమస్యకు అసలు కారణం కనిపెట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు ఐరన్, విటమిన్ బి12 ఉండే ఆహారాలను, సప్లిమెంట్లను తీసుకోవాలి. వాటిని డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి.
మనకు ఐరన్ ఎక్కువగా.. బ్రోకలీ, పాలకూర, ఆలుగడ్డలు (పొట్టుతో), బీన్స్, పచ్చి బఠానీలు, ఇతర అన్ని రకాల బీన్స్, యాప్రికాట్స్, అంజీర్, కిస్మిస్, వేరుశెనగలు, జీడిపప్పు, పొద్దు తిరుగుడు విత్తనాలు, వాల్ నట్స్, బాదంపప్పు, హోల్ గ్రెయిన్ బ్రెడ్, పాస్తా, తృణ ధాన్యాలు, బ్రౌన్ రైస్‌లలో.. లభిస్తుంది.
విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల మన శరీరం మనం తినే ఆహారాల్లో ఉండే ఐరన్‌ను ఎక్కువగా గ్రహిస్తుంది. కాఫీ, టీ, కోలా, కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల ఐరన్ శోషణ తగ్గుతుంది. కనుక రక్తహీనత ఉన్నవారు ఈ పదార్థాలకు దూరంగా ఉండాలి. దీంతో ఐరన్ ఎక్కువగా లభిస్తుంది. రక్తహీనత సమస్య తగ్గుతుంది.