వింటే భారతమే వినాలి….. తింటే గారెలే తినాలి… చూస్తే సీతారాముల కల్యాణమే చూడాలి. ఎందుకంటే… వైదిక వివాహ వ్యవస్థకు ప్రతీకలుగా నిలిచిన ఆదర్శ దంపతులు శ్రీ సీతారాములు. అందుకే వారి కల్యాణం సకల లోకాలకూ ఆదర్శప్రాయమైంది..ఆచరణదాయకమైంది…పండుగ అయింది. సీతాదేవి వివాహ విషయంలో వాల్మీకి తరువాత వచ్చిన చాలామంది కవులు వారి వారి సొంత ఆలోచనలను చొప్పించి మూలకథకు ద్రోహం చేసారనే చెప్పాలి. దానికి తోడు సినిమా వాళ్ల పుణ్యమాని అసలు రామాయణం అటక ఎక్కింది. అందులో ముఖ్యమైనవి…సీతాదేవి చెలికత్తెలతో బంతిఆట ఆడుతూంటే, ఆ బంతి వెళ్లి శివధనుస్సు ఉన్న పెట్టె క్రింద దూరడం., సీతాదేవి ఆ పెట్టెను తన ఎడమచేత్తో తోసి ఆ బంతి తీసుకోవడం..అది చూసిన జనకుడు ఆ శివధనుస్సును ఎక్కుపెట్టిన వీరునకే సీతనిచ్చి వివాహం చేస్తానని ప్రకటించడం, ఆ స్వయంవరానికి రావణుడు రావడం… శివధనుస్సు ఎత్తలేక భంగపడడం.. వంటి కల్పనలతో మూలకథను మూల కూర్చోబెట్టారు.
శివధనుస్సును ఎక్కుపెట్టిన వీరునికి సీతనిచ్చి వివాహం జరిపిస్తానని జనకుడు ప్రకటించిన మాట వాస్తవం. కానీ..సీతాదేవి బంతిఆట ఆడడం., ధనుఃపేటికను ప్రక్కకు జరిపి బంతి తీసుకోవడం.., సీతా స్వయంవరానికి రావణుడు రావడం వంటివి మాత్రం అబద్ధం. యాగభూమిలో నాగేటిచాలున సీతాదేవి పసిబిడ్డగా జనకునకు దొరికింది. కారణజన్మురాలిగా దొరికిన ఆమెను కారణజన్మునకే ఇచ్చి వివాహం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు జనకుడు. అందుకు శివధనుర్భంగమే సరైన పరీక్ష అని తలచి స్వయంవరం ప్రకటించాడు. నిజానికి సీతా స్వయంవరం ఒక ప్రత్యేకమైన రోజున ఏర్పాటు చేయలేదు. స్వయంవరం ప్రకటించిన నాటినుండి ప్రతినిత్యం ఎందరో వీరులు రావడం..భంగపడడం జరుగుతూనే ఉంది. అలాగే విశ్వామిత్రుని వెంట శ్రీరాముడు వచ్చాడు. అయితే స్వయంవరానికని రాలేదు. జనకుడు చేస్తున్న యాగం చూడాలని వచ్చాడు. అపర మన్మథునిలా ఉన్న రాముని చూడగానే జనకుడు సంతసించి శివధనుస్సు గురించి విశ్వామిత్రునకు చెప్పడం..ఆ తర్వాత రాముడు శివధనుస్సు ఎక్కుపెట్టడం జరిగింది.
రామునకు స్వయంవర నియమం తెలియనే తెలియదు. నువ్వు సీతను వివాహం చేసుకోవాలి అని జనకుడు రామునితో అంటే… నాకీ స్వయంవర నియమం తెలియదు., తెలిస్తే శివధనుస్సు ఎక్కుపెట్టే వాడినే కాదు.. అంటాడు. ఇది జరిగిన మూడురోజులకు దశరథాదులు రావడం., ఈ వివాహానికి సమ్మతించడం., సీతారాముల వివాహం జరగడం జరిగింది. సీత తనకు భార్యగా తన తండ్రి అంగీకరించిన కారణంగా రామునకు సీత అంటే ప్రేమట అని అంటాడు వాల్మీకిమహర్షి. అంతే కాదు..శ్రీరాముడు పాణిగ్రహణం చేసే సమయంలోనే సీతాదేవిని చూసాడుగానీ.. స్వయంవర సభలో కాదు. ఇందుకు జనకుడే ప్రత్యక్ష సాక్షి. జనకుడు కన్యాదానం చేస్తూ సీతను రామునకు చూపిస్తూ.. రామా…ఆదిగో నా కుమార్తె సీత.. చూడు..ఈమె పాణిని గ్రహించు…నీకు శుభం కలుగుతుంది అంటాడు జనకుడు. కనుక రాముడు సీతా సౌందర్యానికి వ్యామోహితుడై ఆమెను వివాహం చేసుకోలేదు. తన తండ్రి ఒప్పుకున్నాడు కనుక సీతను పేళ్లి చేసుకున్నాడు అన్నది నిజం.
ఇక రావణుడు సీతా స్వయంవరానికి రాలేదు. రావణుని దృష్టిలో నరులు., వానరులు ఓ లెక్కలోనివారు కాదు. పైగా వారంటే చిన్నచూపు కూడాను. అందుకే తను వరాలు కోరుకున్నప్పుడు వీరిని ప్రక్కన పెట్టాడు. అలాంటప్పుడు నరకాంత అయిన సీతా స్వయంవరానికి రావణుడు ఎందుకు వస్తాడు? ఒకవేళ వచ్చాడే అనుకుందాం..వీరుడు కాబట్టి శివధనుస్సు ఎక్కుపెట్టడానికి ప్రయత్నించి భంగపడి ఉండవచ్చు. అంతటితో రావణుడు వెనుదిరిగి వెడతాడనుకోవడం పొరపాటు. అతని నైజమే అదికాదు. సృష్టిలో ఉన్న సౌందర్య సంపద అంతా రావణుడు తన బలంతో సాధించుకు తెచ్చినదే. అలాంటప్పుడు త్రిలోకైక సౌందర్యవతి అయిన సీతను ఎందుకు వదులుతాడు? నీ స్వయంవర నియమాలతో నాకు పనిలేదు..సీతను తీసుకువెడుతున్నాను అని జనకునితో చెప్పి సీతను తీసుకుని వెళ్ళిపోతాడు. అప్పటికింకా సీత అవివాహిత కనుక., రాక్షస వివాహము ధర్మసమ్మతమే కనుక సీతకూడా విధిలేక రావణుని భర్తగా అంగీకరింపక తప్పదు. ఆ సమయంలో రావణునకు అడ్డుపడేందుకు రామునకు ఏ అధికారం లేదు. ఎందుకంటే..అప్పటికి సీత తన భార్య కాలేదు. కనుక రాముడు చేయగలిగింది ఏదీ లేదు. నిజానికి రావణుడు సీతా స్వయంవరానికి వచ్చి ఉంటే… సీత రాముని భార్య అయ్యేది కాదు.. రామకథ ఇంత ఉండేది కాదు. కనుక సినిమా కథల వెంట పడక వాల్మీకి రామాయణాన్ని చదవండి.. రామకథా సుధను ఆస్వాదించి ఆనందించండి.