Alasanda Garelu : మనం ఆహారంగా తీసుకునే పప్పు దినుసుల్లో అలసందలు కూడా ఒకటి. అలసందల్లో ప్రోటీన్లతో పాటు మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. అలసందలను కూరగా వండుకుని తినడంతో పాటు వీటితో మనం గుగ్గిళ్లను, గారెలను కూడా తయారు చేస్తూ ఉంటాం. అలసందలతో చేసే గారెలు చాలా రుచిగా ఉంటాయి. ఈ గారెలను తయారు చేయడం కూడా చాలా తేలిక. రుచిగా, కరకరాలడుతూ ఉండేలా అలసందలతో గారెలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అలసంద గారెల తయారీకి కావల్సిన పదార్థాలు..
అలసందలు – 500 గ్రా., తరిగిన కొత్తిమీర – కొద్దిగా, తరిగిన పుదీనా – కొద్దిగా, తరిగిన కరివేపాకు – రెండు రెమ్మలు, అల్లం – ఒక ఇంచు ముక్క, పచ్చిమిర్చి – 6, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, ఉప్పు – తగినంత.

అలసంద గారెల తయారీ విధానం..
ముందుగా అలసందలను శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి 6 గంటల పాటు నానబెట్టాలి. అలసందలు నానిన తరువాత వాటిని జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చి, అల్లం వేసి నీళ్లు పోయకుండా బరకగా మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసి కలపాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని గారెలుగా వత్తుకుని నూనెలో వేసుకోవాలి. ఈ గారెలను మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే అలసంద గారెలు తయారవుతాయి. ఈ గారెలను పల్లి చట్నీ, నిమ్మకాయ కారం వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. అలాగే చికెన్, మటన్ వంటి వాటితో కూడా ఈ గారెలను తినవచ్చు. సాయంత్రం సమయాల్లో స్నాక్స్ గా కూడా ఈ గారెలను తయారు చేసుకుని తినవచ్చు. ఈ గారెలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.