Aloo Beans Masala Fry : మనం ఆహారంగా తీసుకోదగిన కూరగాయల్లో బీన్స్ కూడా ఒకటి. బీన్స్ కూడా మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలను కలిగి ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ వీటిని చాలా మంది తినడానికి ఇష్టపడరు. బీన్స్ ను నేరుగా తినడం ఇష్టం లేని వారు వీటితో బంగాళాదుంపలను కలిపి ఎంతో రుచిగా ఉండే ఫ్రైను కూడా తయారు చేసుకోవచ్చు. ఆలూ బీన్స్ కలిపి చేసే ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. బీన్స్ ను ఇష్టపడని వారు కూడా ఈ ఫ్రైను ఇష్టంగా తింటారు. రుచిగా, సులభంగా ఆలూ బీన్స్ ఫ్రై ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ బీన్స్ మసాలా ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన బంగాళాదుంపలు – పావుకిలో, తరిగిన బీన్స్ – పావుకిలో, సన్నగా పొడుగ్గా తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 2, వెల్లుల్లి రెబ్బలు – 8, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2.
ఆలూ బీన్స్ మసాలా ఫ్రై తయారీ విధానం..
ముందుగా గిన్నెలో నీటిని తీసుకోవాలి. ఇందులో బంగాళాదుంప ముక్కలు, బీన్స్ వేసి కలపాలి. తరువాత వీటిపై మూత పెట్టి బంగాళాదుంప ముక్కలను సగానికి పైగా ఉడికించాలి. తరువాత వీటిని వడకట్టి ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత వెల్లుల్లి రెబ్బలు, ఉడికించిన ఆలూ, బీన్స్ వేసి కలపాలి. వీటిని రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత మూత పెట్టి 5 నిమిషాల పాటు వేయించాలి. తరువాత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలపాలి. వీటిని మరో నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ బీన్స్ మసాలా ఫ్రై తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.