Aloo Gongura Curry : మనం గోంగూరను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. గోంగూర మన శరీరానికి చేసే అంతా ఇంతా కాదు. గోంగూరను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. రక్తహీనతను తగ్గించడంలో, ఎముకలను ధృడంగా ఉంచడంలో, రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇలా అనేక రకాలుగా గోంగూర మనకు సహాయపడుతుంది. దీనితో మనం పచ్చడిని, పప్పును ఎక్కువగా తయారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా గోంగూర బంగాళాదుంపలను కలిపి మనం ఎంతో రుచిగా ఉండే కూరను తయారు చేసుకోవచ్చు. ఈ కూరను తయారు చేయడం చాలా తేలిక. ఆలూ గోంగూర కూరను తయారు చేసుకునే విధానాన్ని అలాగే తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ గోంగూర కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, పెద్ద ముక్కలుగా తరిగిన బంగాళాదుంపలు – 2, గోంగూర కట్టలు – 2, పచ్చిమిర్చి – 2, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన టమాటాలు – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, నీళ్లు – ఒక గ్లాస్, తరిగిన కొత్తిమీర – ఒక చిన్న కట్ట.
ఆలూ గోంగూర కర్రీ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక బంగాళాదుంప ముక్కలను వేసి కలపాలి. తరువాత వీటిపై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. తరువాత ఈ ముక్కలను ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. తరువాత అదే కళాయిలో గోంగూర, పచ్చిమిర్చి వేసి కలపాలి. తరువాత దీనిపై మూతను ఉంచి గోంగూర మెత్తగా అయ్యే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ గోంగూరను జార్ లో వేసి మిక్సీ పట్టుకుని పక్కకు ఉంచాలి. ఇప్పుడు మరో కళాయిలో టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. తరువాత టమాట ముక్కలు, అల్లం పేస్ట్ వేసి కలపాలి.
తరువాత వీటిపై మూత పెట్టి టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేయించాలి. తరువాత ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి వేసి కలపాలి. తరువాత మిక్సీ పట్టుకున్న గోంగూర వేసి కలపాలి.దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత వేయించిన బంగాళాదుంప ముక్కలను వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసి కలిపి మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత కొత్తిమీర వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ గోంగూర కర్రీ తయారవుతుంది. దీనిని అన్నం, పులావ్, బిర్యానీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ కర్రీని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.