Aloo Palak Masala Curry : పాలకూరను తగిన మోతాదులో తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చన్న సంగతి మనకు తెలిసిందే. పాలకూరలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. పాలకూరతో చేసే కూరలను తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. పాలకూరతో మనం వివిధ రకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. పాలకూరలో బంగాళాదుంపలను వేసి మనం ఎంతో రుచిగా ఉండే కూరను తయారు చేసుకోవచ్చు. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఎవరైనా దీనిని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఆలూ పాలక్ మసాలా కూర తయారీ విధానాన్ని అలాగే తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ పాలక్ మసాలా కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన బంగాళాదుంపలు – 2, పాలకూర – 4 కట్టలు, తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క – ఒక చిన్న ముక్క, లవంగాలు – 2, యాలకులు – 2, ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, తాళింపు దినుసులు – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 2, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – 2 టేబుల్ స్పూన్స్, కసూరి మెంతి – ఒక టీ స్పూన్.
ఆలూ పాలక్ మసాలా కర్రీ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో ఒక లీటర్ నీటిని తీసుకుని వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక పాలకూర వేసి రెండు నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత పాలకూరను తీసి చల్లగా అయ్యే వరకు ఉంచాలి. పాలకూర చల్లారిన తరువాత దానిని జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మసాలా దినుసులు, తాళింపు దినుసులు, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
తరువాత మిక్సీ పట్టుకున్న పాలకూర పేస్ట్ వేసి నూనె పైకి తేలే వరకు వేయించాలి. తరువాత ఉడికించిన బంగాళాదుంపలను ముక్కలుగా చేసి వేసుకోవాలి. తరువాత ఒక గ్లాస్ నీళ్లు పోసి కలిపి పది నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత కసూరి మెంతి వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ పాలక్ తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, పుల్కా వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. పాలకూరతో చేసిన ఈ కూరను తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ కూరను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.