Aloo Rice : మనం అన్నంతో రకరకాల వెరైటీలను తయారు చేస్తూ ఉంటాం. అన్నంతో చేసే వెరైటీలు చాలా రుచిగా ఉండడంతో పాటు వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. అన్నంతో చేసుకోదగిన వెరైటీ వంటకాల్లో ఆలూ రైస్ కూడా ఒకటి. బంగాళాదుంపలను ఉపయోగించి చేసే ఈ రైస్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎవరైనా చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. అలాగే దీనిని తయారు చేయడానికి ఎక్కువగా సమయం కూడా పట్టదు. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే ఈ ఆలూ రైస్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 6 టేబుల్ స్పూన్స్, క్యూబ్స్ లా తరిగిన బంగాళాదుంపలు – 2, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 3, దంచిన యాలకులు – 2, మిరియాలు – అర టీ స్పూన్, ఆవాలు -అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్స్, కరివేపాకు – రెండు రెమ్మలు, తరిగిన పచ్చిమిర్చి – 2, అల్లం తరుగు – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, చిన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, అన్నం – ఒక కప్పు బియ్యంతో వండినంత, పచ్చి కొబ్బరి తరుము – పావు కప్పు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, కచ్చా పచ్చాగా దంచిన మిరియాల పొడి – అర టీ స్పూన్.
ఆలూ రైస్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక బంగాళాదుంప ముక్కలను వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, మిరియాలు వేసి వేయించాలి. తరువాత ఆవాలు, జీలకర్ర, జీడిపప్పు, కరివేపాకు, అల్లం తరుగు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి కలపాలి. ఉల్లిపాయ ముక్కలు రంగు మారిన తరువాత అన్నం, పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీర, వేయించిన బంగాళాదుంప ముక్కలు వేసి అన్నం వేడిగా అయ్యే వరకు కలుపుతూ వేయించాలి.
చివరగా మరికొద్దిగా కొత్తిమీర, మిరియాల పొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ రైస్ తయారవుతుంది. ఈ విధంగా తయారు చేసిన ఆలూ రైస్ ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్ లోకి కూడా ఈ రైస్ చాలా చక్కగా ఉంటుంది. అన్నంతో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా ఆలూ రైస్ ను కూడా తయారు చేసుకుని తినవచ్చు.