Amla Murabba : ఉసిరికాయలతో ఎక్కువగా పచ్చళ్లను తయారు చేస్తూ ఉంటాము. కేవలం పచ్చళ్లే కాకుండా ఉసిరికాయలతో చేసుకోదగిన మరో రుచికరమైన వంటకాల్లో ఆమ్లా మురబ్బా కూడా ఒకటి. ఆమ్లా మురబ్బా చాలా రుచిగా ఉంటుంది. ఉసిరికాయలు దొరికినప్పుడు దీనిని తయారు చేసి పెట్టుకుంటే మనం సంవత్సరమంతా ఉసిరికాయలను తినవచ్చు. ఈ ఆమ్లా మురబ్బాను తినడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. అలాగే దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఆమ్లా మురబ్బాను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆమ్లా మురబ్బా తయారీకి కావల్సిన పదార్థాలు..
పెద్ద ఉసిరికాయలు – అరకిలో, పంచదార – అరకిలో,నీళ్లు – 2 లేదా 3 టేబుల్ స్పూన్స్, ఉప్పు – పావుటీ స్పూన్, నిమ్మరసం – ఒక టీ స్పూన్, దంచిన యాలకులు – 4.
ఆమ్లా మురబ్బా తయారీ విధానం..
ముందుగా ఉసిరికాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి. తరువాత ఈ ఉసిరికాయలను ఆవిరి మీద ఉడికించాలి. ఈ ఉసిరికాయలను మరీ మెత్తగా కాకుండా కేవలం 10 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై ఆవిరి మీద ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఒక్కో ఉసిరికాయను తీసుకుంటూ వాటిని ఫోర్క్ తో రంధ్రాలు పెట్టుకుని పక్కకు ఉంచాలి. తరువాత గిన్నెలో పంచదార, నీళ్లు, ఉడికించిన ఉసిరికాయలు వేసి కలపాలి. వీటిని చిన్న మంటపై కదుపుతూ ఉడికించాలి. పంచదార కరుగుతుండగానే ఉప్పు, నిమ్మరసం, యాలకులు వేసి కలపాలి. పంచదార కరిగిన తరువాత మంటను మధ్యస్థంగా చేసి మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించాలి.
ఇప్పుడు మరోసారి అంతా కలుపుకుని మరలా మూత పెట్టి మంటను చిన్నగా చేసి మరో 10 నుండి 15 నిమిషాల పాటు ఉడికించాలి. పంచదార పాకం రంగు మారడంతో పాటు ముదురు తీగపాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత మూత తీసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ ఉసిరికాయలు చల్లారిన తరువాత మూత పెట్టి ఒక రోజంతా అలాగే ఉంచాలి. ఉసిరికాయలు బాగా ఊరిన తరువాత వాటిని గాజు సీసాలో వేసి నిల్వ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆమ్లా మురబ్బా తయారవుతుంది. ఇలా ఇంట్లోనే ఆమ్లా మురబ్బాను తయారు చేసుకుని సంవత్సరమంతా తినవచ్చు.