How To Take Dry Fruits : మనం చక్కటి ఆరోగ్యం కోసం డ్రై ఫ్రూట్స్ ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. డ్రైఫ్రూట్స్ లో ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకుంటాము. అయితే డ్రై ఫ్రూట్స్ ను ఆహారంగా తీసుకుంటూ ఉన్నప్పటికి చాలా మంది వీటి వల్ల కలిగే ప్రయోజనాలను పూర్తి స్థాయిలో పొందలేకపోతున్నారని నిపుణులు చెబుతున్నారు. మన శరీరం యొక్క తత్వాన్ని బట్టి ఈ డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మనం శరీరం వాత, కఫ, పిత తత్వాలను కలిగి ఉంటుందని దీనిని బట్టి మనం డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అప్పుడే మనం పూర్తి ప్రయోజనాలను పొందగలమని వారు చెబుతున్నారు. మన శరీర తత్వాన్ని బట్టి డ్రై ఫ్రూట్స్ ను ఎలా, ఎప్పుడు తీసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా అంజీర్ లు, ఎండు ద్రాక్షలు చలువ చేసే గుణాన్ని కలిగి ఉంటాయి. కనుక వీటిని పిత్త దోషం ఉన్న వారు తీసుకోవాలి. పిత్త దోషం ఉన్నవారిలో వేడి చేసే గుణం ఎక్కువగా ఉంటుంది. వేడి వల్ల తలనొప్పి, కాళ్లు పగలడం, జుట్టు రాలడం వంటి సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కనుక వేడి శరీరతత్వం ఉన్న వారు చలువ చేసే అంజీరాలను, ఎండుద్రాక్షలను నానబెట్టి తీసుకోవాలి. అలాగే వాతం దోషంతో బాధపడే వారిలో కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పి ఎక్కువగా ఉంటాయి. అలాంటి వారు వేడి చేసే గుణం ఉన్న జీడిపప్పు, పిస్తా, బాదం, ఖర్జూర వంటి వాటిని తీసుకోవాలి. దీంతో వాత దోషాలు తగ్గడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. ఇక కఫ దోషం ఉన్న వారిలో శ్వాస సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి.
శ్వాస ఆడకపోవడం, దగ్గు, ఆస్థమా వంటి సమస్యలు ఉన్న వారు పిస్తా, బాదం వంటి డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవాలి. అలాగే మనం వాల్ నట్స్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వీటికి మూడు దోషాలను తగ్గించే గుణం ఉందని వీటిని ఎవరైనా ఆహారంగా తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ డ్రై ఫ్రూట్స్ ను చాలా మంది నెయ్యిలో వేయించి ఉప్పు, కారం చల్లుకుని తింటూ ఉంటారు. అలా అస్సలు తీసుకోకూడదని కేవలం నీటిలో నానబెట్టి మాత్రమే తీసుకోవాలని అప్పుడే పూర్తి స్థాయి ఆరోగ్య ప్రయోజనాలను పొందగలుగుతామని నిపుణులు చెబుతున్నారు.