Andhra Style Royyala Pulao : మనం ఆహారంగా తీసుకునే సముద్రపు ఆహారాల్లో రొయ్యలు ఒకటి. రొయ్యల్లో మన శరీరానికి అవసరమయ్యే ముఖ్యమైన పోషకాల్నీ ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. రొయ్యలతో చేసే ఏ వంటకమైన చాలా రుచిగా ఉంటుంది. రొయ్యలతో చేసిన వంటకాలను చాలా మంది ఇష్టంగా తింటారు. రొయ్యలతో చేసుకోదగిన వివిధ రకాల రుచికరమైన వంటకాల్లో రొయ్యల పులావ్ ఒకటి. ఇది మనకు రెస్టారెంట్ లలో ఎక్కువగా లభిస్తుంది. దీనిని మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. ఎంతో రుచిగా ఉండే ఈ రొయ్యల పులావ్ ను ఆంధ్రా స్టైల్ లో మన ఇంట్లోనే చాలా సులభంగా ఎలా తయారు చేసుకోవాలి… తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రా స్టైల్ రొయ్యల పులావ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
రొయ్యలు – పావు కిలో, నానబెట్టిన చిట్టి ముత్యాల రైస్ – ఒక కప్పు, ఉప్పు – తగినంత, పసుపు – అర టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, నూనె – పావు కప్పు, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, యాలకులు – 4, లవంగాలు – 4, జాపత్రి – 1, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 3, పుదీనా తరుగు – 2 టేబుల్ స్పూన్స్, కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్స్, వేడి నీళ్లు – 2 కప్పులు లేదా రెండుంపావు కప్పులు.
మసాలా పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
లవంగాలు – 4, యాలకులు – 4, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క.
మసాలా పేస్ట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
చిన్న ఎండు కొబ్బరి ముక్కలు – 4, ధనియాలు – 2 టీ స్పూన్స్, గసగసాలు – ఒక టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 7, అల్లం – అర ఇంచు ముక్క.
ఆంధ్రా స్టైల్ రొయ్యల పులావ్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు వేసి దోరగా వేయించాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకుని మెత్తని పొడిలా చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. తరువాత మరో జార్ లో మసాలా పేస్ట్ కు కావల్సిన పదార్థాలు, కొద్దిగా నీరు పోసి మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు లేకుండా రొయ్యలను తీసుకోవాలి. తరువాత అందులో పావు టీ స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు, ఒక టీ స్పూన్ కారం వేసి కలపాలి. ఈ రొయ్యలను కళాయిలో వేసి చిన్న మంటపై పావు గంట పాటు వేయించి నీళ్లు లేకుండా ప్లేట్ లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. తరువాత అడుగు మందంగా ఉండే కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, జాపత్రి వేసి వేయించాలి.
తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. తరువాత వేయించిన రొయ్యలు వేసి మరో 5 నిమిషాల పాటు వేయించాలి. తరువాత మసాలా పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా నీళ్లు పోసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు బాగా వేయించాలి. తరువాత నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి తడి పోయే వరకు మధ్యస్థ మంటపై ఉడికించాలి. తరువాత పుదీనా, కొత్తిమీర వేసి నెమ్మదిగా కలుపుకోవాలి. తరువాత నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి 15 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ముందుగా తయారు చేసుకున్న మసాలా పొడిని వేసి మరలా మూత పెట్టి 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి.
15 నిమిషాల తరువాత దీనిని అంతా ఒకసారి కలుపుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆంధ్రా స్టైల్ రొయ్యల పులావ్ తయారవుతుంది. దీనిని రైతాతో చాలా రుచిగా ఉంటుంది. ఈ పులావ్ తయారీలో సాధారణ బియ్యాన్ని కూడా ఉపయోగించవచ్చు. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో బయటకు వెళ్లే పని లేకుండా ఇలా ఇంట్లోనే ఎంతో రుచిగా ఉండే రొయ్యల పులావ్ ను తయారు చేసుకుని తినవచ్చు. దీనిని విడిచి పెట్టకుండా అందరూ ఇష్టంగా తింటారు.