Annam Vadiyalu : మనం వంటింట్లో ప్రతిరోజూ అన్నాన్ని వండుతూ ఉంటాం. చాలా రోజుల నుండి అన్నం మనకు ప్రధాన ఆహారంగా ఉంది. అయితే కొన్నిసార్లు మనం వండిన అన్నం మిగులుతుంది. ఇలా మిగిలిన అన్నాన్ని ఏం చేయాలో చాలా మందికి పాలుపోదు. ఈ అన్నాన్ని వృథా చేయకుండా దీంతో ఎంతో రుచిగా ఉండే వడియాలను మనం తయారు చేసుకోవచ్చు. కేవలం మిగిలిన అన్నంతోనే కాకుండా తాజా అన్నంతో కూడా మనం వడియాలను తయారు చేసుకోవచ్చు. అన్నంతో ఎంతో రుచిగా ఉండే వడియాలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అన్నం వడియాల తయారీకి కావల్సిన పదార్థాలు..
అన్నం – 2 కప్పులు, ఎండు మిరపకాయలు – 3, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత.
అన్నం వడియాల తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో లేదా రోట్లో ఎండు మిరపకాయలను, జీలకర్రను వేసి మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా ఉండే విధంగా దంచుకోవాలి. ఒక గిన్నెలో అన్నాన్ని తీసుకుని అందులో ఉప్పును, ముందుగా దంచుకున్న ఎండు మిరపకాయలను వేసి కలుపుతూ అన్నాన్ని మెత్తగా చేసుకోవాలి. ఇలా మెత్తగా చేసుకున్న అన్నాన్ని ఒక పాలీథిన్ కవర్ పై కావల్సిన పరిమాణంలో, కావల్సిన ఆకారంలో వడియాలలాగా పెట్టి బాగా ఎండే వరకు ఎండలో ఉంచాలి. ఇవి పూర్తిగా ఎండిన తరువాత మూత ఉన్న డబ్బాలో నిల్వ చేసుకోవడం వల్ల చాలా రోజుల వరకు తాజాగా ఉంటాయి.
వీటి తయారీలో ఎండు మిరపకాయలకు బదులుగా పచ్చి మిరపకాయలను కూడా ఉపయోగించవచ్చు. అన్నాన్ని మెత్తగా చేసుకున్న తరువాత వడియాలను చేత్తోనే కాకుండా మురుకుల గొట్టంలో వేసి కూడా వత్తుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న వడియాలను నూనె బాగా కాగిన తరువాత మంటను మధ్యస్థంగా ఉంచి వేయించుకోవాలి. ఇలా మధ్యస్థ మంటపై వేయించుకోవడం వల్ల వడియాలు బాగా వేగుతాయి. ఈ వడియాలను నేరుగా లేదా పప్పు, సాంబార్ వంటి వాటితో కలిపి తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి.