Aratikaya Vepudu : మనం వంటింట్లో రకరకాల వేపుడు కూరలను తయార చేస్తూ ఉంటాం. ఇలా వేపుడు కూరలను తయారు చేయడానికి సులువుగా ఉండే వాటిల్లో పచ్చి అరటి కాయలు ఒకటి. పచ్చి అరటి కాయలతో చేసే వేపుడు చాలా రుచిగా ఉంటుంది. అంతే కాకుండా పచ్చి అరటి కాయలను ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. పచ్చి అరటి కాయలల్లో విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉంటాయి. షుగర్ వ్యాధి గ్రస్తులకు పచ్చి అరటి కాయలు ఎంతో మేలు చేస్తాయి. వీటిని తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది.
వీటిలో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణాశయ సంబంధిత సమస్యలు రాకుండా చేయడంలో సహాయపడుతుంది. బరువు తగ్గడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా పచ్చి అరటి కాయలు ఉపయోగపడతాయి. పచ్చి అరటి కాయలతో వివిధ రకాల కూరలు చేసినప్పటికీ, చాలా మంది వేపుడును అధికంగా తయారు చేస్తూ ఉంటారు. రుచిగా, చాలా సులువుగా పచ్చి అరటి కాయలతో వేపుడును ఎలా తయారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
అరటి కాయ వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు..
పచ్చి అరటి కాయలు – రెండు, నూనె – 3 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – అర టీ స్పూన్, కరివేపాకు – రెండు రెబ్బలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – అర టీ స్పూన్, జీలకర్ర పొడి – పావు టీ స్పూన్, గరం మసాలా – పావు టీ స్పూన్.
అరటి కాయ వేపుడు తయారీ విధానం..
ముందుగా పచ్చి అరటికాయలను మధ్యస్థంగా ఉండేలా ముక్కలుగా చేసుకుని ఉప్పు నీటిలో వేసి ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి నూనె వేడయ్యాక జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి. తరవాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించి ముందుగా ఉప్పు నీటిలో వేసి ఉంచిన అరటికాయ ముక్కలను వేసి 2 నిమిషాల పాటు వేయించాలి. తరువాత ఉప్పు, పసుపు వేసి కలిపి అరటి కాయ ముక్కలను పూర్తిగా వేయించాలి. ఇవి పూర్తిగా వేగిన తరువాత మిగిలిన పదార్థాలను వేసి కలిపి 2 నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రుచిగా ఉండే అరటికాయ వేపుడు తయారవుతుంది. ఇలా చేసుకున్న అరటికాయ వేపుడును పప్పు, రసం, సాంబార్ లతోపాటు లేదా ఇతర కూరలతో కలిపి తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. పచ్చి అరటి కాయలపై ఉండే చెక్కును తీసేటప్పుడు చాకుతో అరటి కాయలకు పొడుగ్గా గాట్లు పెట్టడం వల్ల చెక్కు సులువుగా వస్తుంది. చెక్కును తీసేటప్పుడు చేతులకు నూనెను రాసుకోవడం వల్ల చేతులు నల్లగా కాకుండా ఉంటాయి.