Atukula Pongali : అటుకులు.. వీటితో మనం రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. అటుకులతో అల్పాహారాలనే కాకుండా మనం తీపి వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాం. అటుకులతో చేసుకోదగిన తీపి వంటకాల్లో అటుకుల పొంగలి కూడా ఒకటి. ఈ పొంగలి చాలా రుచిగా ఉంటుంది. ప్రసాదంగా లేదా స్నాక్స్ గా కూడా దీనిని తినవచ్చు. అటుకులతో కేవలం 10 నిమిషాల్లోనే మనం ఎంతో రుచికరమైన పొంగలిని తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచికరమైన మరియు ఆరోగ్యానికి మేలు చేసే ఈ అటుకుల పొంగలిని ఎలా తయారు చేసుకోవాలి..తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అటుకుల పొంగలి తయారీకి కావల్సిన పదార్థాలు..
దొడ్డు అటుకులు – ఒక కప్పు, కాచి చల్లార్చిన పాలు – అర కప్పు, బెల్లం తురుము – పావు కప్పు, పచ్చి కొబ్బరి తురుము – ఒక టేబుల్ స్పూన్, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, డ్రై ఫ్రూట్స్ – కొద్దిగా, యాలకులు – 4.
అటుకుల పొంగలి తయారీ విధానం..
ముందుగా అటుకులను జల్లెడలో వేసి జల్లించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో కొద్ది కొద్దిగా పాలను పోసుకుంటూ కలుపుకోవాలి. తరువాత ఈ అటుకులను 5 నిమిషాల పాటు నానబెట్టాలి. ఇప్పుడు కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత ఇదే కళాయిలో బెల్లం తురుము, పావు కప్పులో సగం నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లం కరిగిన తరువాత మరో 2 నిమిషాల పాటు దీనిని మరిగించాలి. బెల్లం నీళ్లు మరుగుతున్నప్పుడు పచ్చి కొబ్బరి తురుము వేసి కలపాలి. తరువాత నానబెట్టుకున్న అటుకులను వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత వేయించిన డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే అటుకుల పొంగలి తయారవుతుంది. దీనిని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. పిల్లలు దీనిని మరింత ఇష్టంగా తింటారు. స్నాక్స్ గా తినడానికి కూడా ఈ పొంగలి చాలా చక్కగా ఉంటుంది.