Babu Gogineni : ప్రభాస్, పూజా హెగ్డె జంటగా నటించిన చిత్రం.. రాధే శ్యామ్. ఈ సినిమా ఈ మధ్యే థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయింది. అయితే మొదటి రెండు రోజులు ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ ఆ తరువాత నెగెటివ్ రివ్యూస్ ఎక్కువైపోయాయి. మరీ దారుణంగా సినిమాను తెరకెక్కించారని.. అసలు లాజిక్ లేకుండా సినిమా కొనసాగుతుందని.. చాలా మంది విమర్శలు చేశారు. దీంతో ఈ సినిమాకు 3 రోజుల తరువాత నుంచి కలెక్షన్స్ భారీగా పడిపోయాయి. దీంతో ఫ్లాప్ టాక్ దిశగా ఈ మూవీ కొనసాగుతోంది.
అయితే ఈ మూవీలో జ్యోతిష్య శాస్త్రాన్ని హైలైట్ చేసి చూపించారు. ప్రభాస్ చెప్పింది చెప్పినట్లు జరిగిపోతుంటుంది. ఆయన ఈ మూవీలో విక్రమాదిత్య పాత్రలో నటించారు. అయితే జ్యోతిష్యం, మూఢ నమ్మకాలపై ఎప్పుడూ విమర్శలు చేసే బాబు గోగినేని ఈ మూవీపై కూడా విమర్శలు చేశారు. ప్రభాస్ క్యారెక్టర్ అయిన విక్రమాదిత్యతో అందరూ జాతకం చెప్పించుకుంటే సరిపోతుంది కదా అని ఆయన అన్నారు.
ఇక ఖగోళ శాస్త్రం నుంచి ఉద్భవించిన చిన్న బేబీ జ్యోతిష్య శాస్త్రం అని బాబు గోగినేని కొట్టి పారేశారు. వాట్సాప్ సంభాషణల నుంచి డైలాగ్స్ రాస్తే సినిమా ఇలాగే ఉంటుందని అన్నారు. సినిమా తుస్ అయిందని.. విడుదలకు ముందే విక్రమాదిత్య చేయి చూపించుకుని ఉంటే బాగుండేదని అన్నారు. కాగా బాబు గోగినేని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.