Bagara Rice Recipe : మనం చికెన్, మటన్ లతో పాటు వంటింట్లో వివిధ రకాల మసాలా కూరలను తయారు చేస్తూ ఉంటాం. ఈ మసాలా కూరలను తినడానికి అప్పుడప్పుడూ బగారా అన్నాన్ని కూడా వండుతూ ఉంటాం. మసాలా దినుసులు వేసి చేసే ఈ బగారా అన్నం చాలా రుచిగా ఉంటుంది. మసాలా కూరలల్లోకి ఈ అన్నం చక్కగా ఉంటుంది. ఈ బగారా అన్నాన్ని అందరికి నచ్చే విధంగా ఎలా తయారు చేసుకోవాలి.. అలాగే తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బగారా రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నానబెట్టిన బియ్యం – 500 గ్రా., సన్నగా పొడుగ్గా తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, తరిగిన పుదీనా – కొద్దిగా, నూనె – ఒక టేబుల్ స్పూన్.

మసాలా దినుసులు..
దాల్చిన చెక్క – రెండు ఇంచుల ముక్క, లవంగాలు – 4, యాలకులు – 3, అనాస పువ్వు – 1, బిర్యానీ ఆకులు – 2, సాజీరా – ఒక టీ స్పూన్.
బగారా రైస్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మసాలా దినుసులు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత నానబెట్టిన బియ్యం, గరం మసాలా, పుదీనా, కొత్తిమీర, ఉప్పు వేసి కలపాలి. తరువాత ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ చొప్పున నీటిని పోసి కలపాలి. నీళ్లు అన్నీ అయిపోయే వరకు మధ్యస్థ మంటపై ఉడికించాలి. తరువాత మంటను చిన్నగా చేసి అన్నం మెత్తగా ఉడికే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బగారా రైస్ తయారవుతుంది. దీనిని వెజ్, నాన్ వెజ్ మసాలా కూరలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. అప్పుడప్పుడూ ఇలా ఎంతో రుచిగా బగారా రైస్ ను తయారు చేసుకుని తినవచ్చు.