Beans Vepudu : మనం బీన్స్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. బీన్స్ కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. వివిధ వంటకాల్లో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము. అలాగే వీటితో వివిధ రకాల వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాము. బీన్స్ తో చేసే వంటకాల్లో బీన్స్ వేపుడు కూడా ఒకటి. బీన్స్ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఒక్కో విధంగా తయారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా తయారు చేసే బీన్స్ వేపుడు కూడా చాలా రుచిగా ఉంటుంది. బీన్స్ ను తినని వారు కూడా ఈ వేపుడును ఇష్టంగా తింటారు. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. మరింత రుచిగా, అందరికి నచ్చేలా బీన్స్ వేపుడును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బీన్స్ వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన బీన్స్ – అరకిలో, నీళ్లు – అరగ్లాస్, ఉప్పు – తగినంత, వెల్లుల్లి రెమ్మలు – 10, ఎండుకొబ్బరి ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్, కారం – ఒక టేబుల్ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఎండుమిర్చి – 3, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు – 2 రెమ్మలు.
బీన్స్ వేపుడు తయారీ విధానం..
ముందుగా జార్ లో వెల్లుల్లి రెమ్మలు, ఎండుకొబ్బరి, కారం వేసి మిక్సీ పట్టుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో బీన్స్ ముక్కలు, నీళ్లు, ఉప్పు వేసి మూత పెట్టి బీన్స్ మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఎండుమిర్చి, తాళింపు దినుసులు, కరివేపాకు వేసి వేయించాలి. తాళింపు వేగిన తరువాత ఉడికించిన బీన్స్ ముక్కలు వేసి కలపాలి. వీటిని 4 నుండి 5 నిమిషాల పాటు వేయించిన తరువాత మిక్సీ పట్టుకున్న కారం వేసి కలపాలి. దీనిని చిన్న మంటపై అంతా కలిసేలా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బీన్స్ వేపుడు తయారవుతుంది. పప్పుచారు, పప్పు వంటి వాటితో వీటిని సైడ్ డిష్ గా తింటే ఇది చాలా రుచిగా ఉంటుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.