Beerakaya Curry : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో బీరకాయ కూడా ఒకటి. బీరకాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనితో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాము. బీరకాయలతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. బీరకాయలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో బీరకాయ కూర కూడా ఒకటి. బీరకాయ కూరను మామూలుగా చేయడంతో పాటు చాలా మంది ఈ కూరను పాలు పోసి కూడా వండుకుంటూ ఉంటారు. పాలు పోసి చేసే బీరకాయ కూర కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. పాలు పోసి రుచిగా బీరకాయ కూరను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బీరకాయ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
బీరకాయలు – 400 గ్రా., పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 2, నూనె – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, పసుపు – పావు టీస్పూన్, ఉప్పు – తగినంత, కారం – 2 టీ స్పూన్స్, గరం మసాలా – అర టీ స్పూన్, ధనియాల పొడి – అర టీ స్పూన్, కాచి చల్లార్చిన పాలు – ఒక కప్పు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
బీరకాయ కర్రీ తయారీ విధానం..
ముందుగా బీరకాయలను శుభ్రంగా కడిగి వాటిపై ఉండే పొట్టును తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు. పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. తరువాత బీరకాయ ముక్కలు వేసి కలపాలి. వీటిని రెండు నిమిషాల పాటు పెద్ద మంటపై వేయించిన తరువాత మూత పెట్టి మధ్యస్థ మంటపై 5 నిమిషాల పాటు వేయించాలి. ముక్కలు సగానికి పైగా ఉడికిన తరువాత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి వేసి కలపాలి.
దీనిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత పాలు పోసి కలపాలి. తరువాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. కూరను ఉడికించేటప్పుడు పాలు కొద్దిగా విరిగినట్టుగా అవుతాయి. అయినప్పటికి కూర చాలా రుచిగా ఉంటుంది. ముక్కలు ఉడికి కూర దగ్గర పడిన తరువాత కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బీరకాయ కర్రీ తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన కర్రీని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.