Beerakaya Perugu Pachadi : మన ఆరోగ్యానికి మేలు చేసే అనేక రకాల కూరగాయల్లో బీరకాయ ఒకటి. బీరకాయను తినడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. బీరాకయ మన శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఈ బీరకాయతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. ఈ బీరకాయలతో కూడా మనం పెరుగు పచ్చడిని తయారు చేసుకోవచ్చు. బీరకాయలతో చేసే పెరుగు పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఎవరైనా కూడా దీనిని చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే బీరకాయ పెరుగు పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బీరకాయ పెరుగు పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన బీరకాయలు – అరకిలో, పెరుగు – 200 గ్రాములు, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, తాళింపు దినుసులు – 2, ఎండుమిర్చి – 2, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – ఒక టేబుల్ స్పూన్, ఇంగువ – పావు టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ.
బీరకాయ పెరుగు పచ్చడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో బీరకాయ ముక్కలు, చిటికెడు ఉప్పు, మూడు టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి కలపాలి. తరువాత వీటిపై మూత పెట్టి బీరకాయ ముక్కలను మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. తరువాత వాటిలో ఎక్కువగా ఉండే నీరు పోయేంత వరకు వేయించాలి. ఇప్పుడు మరో కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, ఎండుమిర్చి, ఇంగువ వేసి వేయించాలి. తరువాత కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. పచ్చిమిర్చి వేగిన తరువాత బీరకాయ ముక్కలు, పసుపు వేసి కలపాలి. ఈ బీరకాయ ముక్కలను మరో రెండు నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
బీరకాయ ముక్కలు పూర్తిగా చల్లారిన తరువాత అందులో చిలికిన పెరుగు, ఉప్పు వేసి అంతా కలిసేలా బాగా కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బీరకాయ పెరుగు పచ్చడి తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. బీరకాయతో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా పెరుగు పచ్చడిని కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఈ బీరకాయ పెరుగు పచ్చడిని తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు.