Bellam Rotte : మనం బెల్లం తో రకరకాల తీపి వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. బెల్లంతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. బెల్లంతో మనం ఎంతో రుచిగా ఉండే రొట్టెలను కూడా తయారు చేసుకోవచ్చు. బెల్లం, మినపప్పు కలిపి చేసే ఈ రొట్టెలుతియ్య తియ్యగా చాలా రుచిగా ఉంటాయి. వీటిని పాతకాలంలో ఎక్కువగా తయారు చేసేవారు. అల్పాహారంగా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. ఎంతో కమ్మగా ఉండే ఈ బెల్లం రొట్టెలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బెల్లం రొట్టె తయారీకి కావల్సిన పదార్థాలు..
మినపప్పు -ఒక కప్పు, సన్నగా ఉండే బియ్యం రవ్వ – 3 కప్పులు, బెల్లం – 3 కప్పులు, యాలకుల పొడి – అర టీ స్పూన్.

బెల్లం రొట్టె తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో మినపప్పును తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. అలాగే రవ్వను కడిగి నీళ్లు లేకుండా చేసుకుని పక్కకు ఉంచాలి. ఇప్పుడు మినపప్పును జార్ లో వేసి వీలైనంత తక్కువ నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో రవ్వను వేసి కలపాలి. ఇప్పుడు ఒక గిన్నెలో బెల్లం తురుము, ఒక స్పూన్ నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లం కరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి దీనిని వడకట్టి రవ్వలో వేసుకోవాలి. ఇప్పుడు పిండి, రవ్వ, బెల్లం అంతా కలిసేలా కలుపుకోవాలి. తరువాత యాలకుల పొడి వేసి కలిపి గంట పాటు పక్కకు ఉంచాలి. సమయం ఎక్కువగా ఉన్న వారు దీనిని 4 గంటల పాటు కూడా ఇలాగే పక్కకు ఉంచవచ్చు.
ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా చిన్నగా ఉండే కళాయిని ఉంచి వేడి చేయాలి. తరువాత ఇందులో నూనె వేసి కళాయి అంతా గ్రీస్ చేసుకోవాలి. తరువాత ఇందులో నూనె వేసి వేడి చేయాలి. ఇప్పుడు పిండిని తీసుకుని మందంగా దోశ లాగా వేసుకోవాలి. తరువాత దీనిపై మూత ఉంచి మధ్యస్థ మంటపై ఎర్రగా కాల్చుకోవాలి. తరువాత మరో వైపుకు తిప్పి ఎర్రగా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బెల్లం రొట్టె తయారవుతుంది. దీనిని కొద్దిగా చల్లారిన తరువాత తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా మినపప్పు, బెల్లంతో రుచికరమైన రొట్టెలను తయారు చేసుకుని తినవచ్చు. వీటిని తినడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. పిల్లలు వీటిని ఎంతో ఇష్టంగా తింటారు.