Bendakaya Palli Karam : బెండకాయలతో తరచూ ఒకేరకం కూరలు తిని తిని బోర్ కొట్టిందా.. బెండకాయలతో కొత్తగా ఏదైనా ట్రై చేయాలనుకుంటున్నారా.. అయితే బెండకాయలతో చేసే ఈ రుచికరమైన వంటకాన్ని మీరు ట్రై చేయాల్సిందే. పల్లికారం వేసి మరింత రుచిగా మనం బెండకాయ వేపుడును తయారు చేసుకోవచ్చు. బెండకాయలతో చేసే ఈ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువగా శ్రమించకుండా చాలా సులభంగా మనం ఈ వేపుడును తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే ఈ బెండకాయ వేపుడును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బెండకాయ పల్లికారం తయారీకి కావల్సిన పదార్థాలు..
పల్లీలు – 3 టీ స్పూన్స్, ఎండుకొబ్బరి ముక్కలు – 2 టీ స్పూన్స్, ధనియాలు – ఒక టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 4, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, కరివేపాకు – ఒక రెమ్మ, బెండకాయలు – పావుకిలో, నూనె – 2 టేబుల్ స్పూన్స్.
బెండకాయ పల్లికారం తయారీ విధానం..
ముందుగా కళాయిలో పల్లీలు, ఎండు కొబ్బరి ముక్కలు, ధనియాలు వేసి దోరగా వేయించాలి. తరువాత వీటిని ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, కారం, కరివేపాకు, పసుపు వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత బెండకాయల చివర్లను తీసేసి వాటికి నిలువుగా గాటు పెట్టుకోవాలి. తరువాత ఈ బెండకాయలను రెండు లేదా మూడు ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత ఈ ముక్కలల్లో ముందుగా మిక్సీ పట్టుకున్న పల్లీకారాన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి.
నూనె వేడయ్యాక బెండకాయ ముక్కలను వేసి కలపాలి. తరువాత వీటిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు వేయించాలి. తరువాత మూత తీసి బెండకాయలను మధ్య మధ్యలో కలుపుతూ పూర్తిగా వేయించాలి. బెండకాయలు పూర్తిగా వేగిన తరువాత మిగిలిన కారాన్ని వేసి కలపాలి. దీనిని మరో 2 నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బెండకాయ పల్లికారం తయారవుతుంది. దీనిని అన్నంతో నేరుగా తినవచ్చు లేదా పప్పు, సాంబార్ వంటి వాటితో సైడ్ డిష్ గా కూడా తినవచ్చు.