Menthikura Nilva Pachadi : మనం మెంతికూరతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. మెంతికూరతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు మన ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. రకత్ంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, ఎముకలను ధృడంగా ఉంచడంలో అనేక రకాలుగా మెంతికూర మనకు సహాయపడుతుంది. తరచూ చేసే వంటకాలతో పాటు మెంతికూరతో మనం ఎంతో రుచిగా ఉండే నిల్వ పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఎవరైనా చాలా సులభంగా ఈ పచ్చడిని తయారు చేసుకోవచ్చు. ఎంతో కమ్మగా ఉండే మెంతికూర నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మెంతికూర నిల్వ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, మెంతులు – చిటికెడు, ఎండుమిర్చి – 6, ఇంగువ – పావు టీ స్పూన్, మెంతికూర – 4 కట్టలు ( చిన్నవి), ఉప్పు – తగినంత, చింతపండు – చిన్న నిమ్మకాయంత.
మెంతికూర నిల్వ పచ్చడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత ఇంగువ వేసి కలిపి వీటిన్నింటిని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో మరికొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. తరువాత మెంతికూర, ఉప్పు వేసి కలపాలి. తరువాత చింతపండు వేసి కలిపి మూత పెట్టాలి. మెంతికూర పూర్తిగా వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.
తరువాత జార్ లో ముందుగా వేయించిన ఎండుమిర్చి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత మెంతికూర వేసి మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఈ పచ్చడిని తాళింపు చేసి గాలితగలకుండా నిల్వ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మెంతికూర నిల్వ పచ్చడి తయారవుతుంది. ఈ పచ్చడి నెలరోజుల పాటు తాజాగా ఉంటుంది. అన్నంతో పాటు అల్పాహారాలతో కూడా ఈ పచ్చడిని తినవచ్చు.