Bitter Gourd Chips : మనకు ఏడాది పొడవునా అందుబాటులో ఉండే కూరగాయల్లో కాకరకాయలు కూడా ఒకటి. ఇవి చేదుగా ఉంటాయి. కనుక ఎవరూ వీటిని తినేందుకు ఇష్టపడరు. కానీ కాకరకాయలను తినడం వల్ల మనం ఎన్నో లాభాలను పొందవచ్చు. కాకరకాయలను వేపుడు, పులుసుతోపాటు టమాటా కూర రూపంలోనూ చేస్తుంటారు. సరిగ్గా చేయాలే కానీ చేదు లేకుండా లేదా తక్కువ చేదుతో ఈ కూరలను చేయవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అయితే కాకరకాయలతో ఎంతో టేస్టీగా ఉండే చిప్స్‌ను కూడా తయారు చేయవచ్చు. సరిగ్గా చేయాలే కానీ ఇవి అందరికీ నచ్చుతాయి. ఇక కాకరకాయల చిప్స్‌ను ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కాకరకాయ చిప్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
కాకరకాయలు – అర కిలో, ఉప్పు – 1 టేబుల్ స్పూన్, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా, కారం – తగినంత.
కాకరకాయ చిప్స్‌ను తయారు చేసే విధానం..
ముందుగా కాకరకాయలను రౌండ్ గా లేదా వేలి పొడవు ఉండేలా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ కట్ చేసిన ముక్కలకు ఉప్పును కలిపి ఒక గంట పాటు ఒక క్లాత్ లో గట్టిగా కట్టి పెట్టాలి. ఒక గంట తర్వాత ఈ కాకరకాయ ముక్కలను బాగా ఆరబెట్టాలి. కాకరకాయ ముక్కలు ఆరిన తరువాత స్టవ్ మీద నూనె పెట్టి నూనెను బాగా వేడి చేయాలి. నూనె వేడి అయిన తర్వాత కాకరకాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన కాకరకాయలపై కాస్త ఉప్పు, తగినంత కారం చల్లాలి. అనంతరం ముక్కలను బాగా కలపాలి. అంతే.. కాకరకాయ చిప్స్ రెడీ అవుతాయి. అయితే కారం, ఉప్పు ముందుగానే కాకరకాయ ముక్కలకు పట్టించి 2 గంటల పాటు ఉండి తరువాత నూనెలో వేయించుకోవచ్చు. దీంతో కూడా కాకరకాయ చిప్స్ రెడీ అవుతాయి. వీటిని నేరుగా అలాగే తినవచ్చు. లేదా అన్నంలో అంచుకు పెట్టి తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటాయి. అందరూ ఇష్టంగా తింటారు.