Bullet Bonda : మనం మైదా పిండితో రకరకాల చిరుతిళ్లను తయారు చేసుకుని తింటూ ఉంటాం. తరచూ కాకుండా అప్పుడప్పుడూ ఈ స్నాక్స్ ను తినడం వల్ల ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం జరగదు. మైదాపిండితో చేసుకోదగిన స్నాక్స్ వెరైటీలలో బుల్లెట్ బోండా కూడా ఒకటి. ఈ బోండాలు చిన్నగా చాలా రుచిగా ఉంటాయి. వీటిని ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా, కరకరలాడుతూ ఉండే ఈ బుల్లెట్ బోండాలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బుల్లెట్ బోండా తయారీకి కావల్సిన పదార్థాలు..
మైదాపిండి – 2 కప్పులు, ఉప్పు – తగినంత, వంటసోడా – పావు టీ స్పూన్, పెరుగు – ముప్పావు కప్పు, జీలకర్ర – ఒక టీ స్పూన్, పచ్చిమిర్చి తరుగు – 2 టీ స్పూన్స్, చిన్నగా తరిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
బుల్లెట్ బోండా తయారీ విధానం..
ముందుగా గిన్నెలో మైదాపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, వంటసోడా వేసి కలపాలి. తరువాత ఇందులో పెరుగు వేసి కలపాలి. ఇప్పుడు తగినన్నినీళ్లు పోసుకుంటూ బోండా పిండిలా పిండిని కలుపుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి పిండి రెండు గంటల పాటు నానబెట్టాలి. తరువాత ఈ పిండిలో జీలకర్ర, పచ్చిమిర్చి తరుగు వేసి బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక చేతికి తడి చేసుకుంటూ ఒక పక్క నుండి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని నూనెలో వేసుకోవాలి. ఈ బోండాలను మధ్యస్థ మంటపై అటూ ఇటూ తిప్పుతూ ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి.
ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బుల్లెట్ బోండా తయారవుతుంది. వీటిని పల్లి చట్నీ, టమాట చట్నీలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. సాయంత్రం సమయాల్లో స్నాక్స్ గా చేసుకుని తినడానికి ఈ బోండాలు చక్కగా ఉంటాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.