Cabbage Pappu : మనం వంటింట్లో ఉపయోగించే కూరగాయలల్లో క్యాబేజి ఒకటి. కానీ దీని వాసన, రుచి కారణంగా చాలా మంది దీనిని తినడానికి ఇష్టపడరు. కానీ ఇతర కూరగాయల మాదిరిగా క్యాబేజి కూడా మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచడంలో, కంటి చూపును మెరుగుపరచడంలో క్యాబేజి సహాయపడుతుంది. మనం ఎక్కువగా క్యాబేజితో పచ్చడిని, వేపుడును తయారు చేస్తూ ఉంటాం. సలాడ్, బర్గర్ ల తయారీలో కూడా క్యాబేజిని ఉపయోగిస్తూ ఉంటారు. కొందరు క్యాబేజితో పప్పును కూడా తయారు చేస్తూ ఉంటారు. క్యాబేజి పప్పు చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ఈ పప్పును తింటే దీని రుచిని అస్సలు మరిచిపోలేరు. ఎంతో రుచిగా ఉండే ఈ క్యాబేజి పప్పును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
క్యాబేజి పప్పు తయారీకి కావల్సిన పదార్థాలు..
కంది పప్పు – ఒక కప్పు, తరిగిన క్యాబేజి – పావు కిలో, తరిగిన టమాట – 1 (పెద్దది), తరిగిన కొత్తిమీర – కొద్దిగా, తరిగిన పచ్చి మిర్చి – 6, తరిగిన ఉల్లిపాయ – ఒకటి, నానబెట్టిన చింతపండు – 15 గ్రా., ఉప్పు – తగినంత, కారం – ఒక టేబుల్ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, నీళ్లు – తగినన్ని.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒకటిన్నర టేబుల్ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, శనగ పప్పు – ఒక టీ స్పూన్, కచ్చా పచ్చాగా చేసిన వెల్లుల్లి రెబ్బలు – 10, కరివేపాకు – ఒక రెబ్బ.
క్యాబేజి పప్పును తయారు చేసే విధానం..
ముందుగా కుక్కర్ లో కందిపప్పును వేసి శుభ్రంగా కడగాలి. తరువాత ఉప్పు తప్ప మిగిలిన పదార్థాలన్నింటినీ వేసి కలిపి మూత పెట్టి 4 నుండి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తరువాత మూత తీసి తగినంత ఉప్పును వేసి పప్పును మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి కాగిన తరువాత తాళింపు పదార్థాలను వేసి తాళింపు చేసుకోవాలి. తాళింపు వేగిన తరువాత ముందుగా ఉడికించిన పప్పును వేసి కలిపి 2 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే క్యాబేజి పప్పు తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ, రాగి సంగటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.
క్యాబేజిని తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. క్యాబేజిలో అధికంగా ఉండే పోషకాలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. విటమిన్ సి, విటమిన్ కె ని అధికంగా కలిగిన ఆహారాల్లో క్యాబేజి కూడా ఒకటి. తరచూ క్యాబేజిని తినడం వల్ల శరీరంలో ఉండే నొప్పులు, వాపులు తగ్గుతాయి. జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించి, గుండె ఆరోగ్యంగా పని చేయడంలో కూడా క్యాబేజి ఉపయోగడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.