Cabbage Paratha : సాధారణంగా చాలా మంది ఉదయం బ్రేక్‌ఫాస్ట్ లేదా మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్‌లలో పరాటాలను తింటుంటారు. వీటిని తినేందుకు ప్రత్యేకమైన సమయం అంటూ ఏమీ ఉండదు. రోజులో వీటిని ఎప్పుడైనా సరే తినవచ్చు. పరాటాలు ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని ప్లెయిన్‌గా చేసుకుని ఏదైనా కూరతో కలిపి తినవచ్చు. లేదా కూరగాయలతో కలిపి వివిధ రకాల పరాటాలను కూడా చేసుకోవచ్చు. ఏవి అయినా సరే పరాటాలు అంటే బాగా రుచిగానే ఉంటాయి. ఈ క్రమంలోనే మనం క్యాబేజీతో కూడా పరాటాలను చేసుకోవచ్చు. ఇవి కూడా రుచిగానే ఉంటాయి. తయారు చేయడం కూడా సులభమే. క్యాబేజీ పరాటాలను ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
క్యాబేజీ పరాటాల తయారీకి కావల్సిన పదార్థాలు..
క్యాబేజీ తురుము – 2 కప్పులు, గోధుమ పిండి – 3 కప్పులు, పెరుగు – అర కప్పు, ఉప్పు – రుచికి సరిపడా, పచ్చి మిర్చి తరుగు – 1 టేబుల్ స్పూన్, అల్లం తరుగు – 1 టీస్పూన్, కొత్తిమీర తరుగు – అర కప్పు, ఉల్లి తరుగు – అర కప్పు, బటర్ – కాల్చడానికి సరిపడా.
క్యాబేజీ పరాటాలను తయారు చేసే విధానం..
ఒక లోతైన పాత్రలో ముందుగా క్యాబేజీ తురుము, పచ్చి మిర్చి తరుగు, అల్లం తరుగు, ఉల్లి తరుగు వేసి ఒకసారి అన్నీ కలిసేలా కలపాలి. తరువాత ఉప్పుతోపాటు పెరుగు వేయాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి వేస్తూ ఉండలు లేకుండా ముద్దలా కలపాలి. అర గంట పాటు తడి వస్త్రం కప్పి పక్కన పెట్టాలి. తరువాత సరిపడే పిండి తీసుకుని పరాటాలు వత్తుకుని పెనంపై రెండు వైపులా మాడిపోకుండా బటర్‌తో కాల్చుకోవాలి. ఈ పరాటాలు వేడి వేడిగా ఉన్నప్పుడే నేరుగా తినవచ్చు. లేదా ఏదైనా కూరతోనూ తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటాయి. అందరికీ నచ్చుతాయి.