Capsicum Tomato Masala Curry : క్యాప్సికంను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఇతర కూరగాయల వలె క్యాప్సికం కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. క్యాప్సికంను మనం ఎక్కువగా ఇతర వంటకాల్లో ఉపయోగిస్తూ ఉంటాం. కానీ క్యాప్సికంతో మనం ఎంతో రుచిగా ఉండే కూరలను కూడా తయారు చేసుకోవచ్చు. క్యాప్సికంతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో క్యాప్సికం టమాట మసాలా కర్రీ కూడా ఒకటి. ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. వంటరాని వారు, మొదటిసారి చేసే వారు, బ్యాచిలర్స్ ఇలా ఎవరైనా దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు.తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే క్యాప్సికం టమాట మసాలా కర్రీ తయారీ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
క్యాప్సికం టమాట మసాలా కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – పావు కప్పు, ఎండుమిర్చి – 2, జీలకర్ర – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, ధనియాల పొడి – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, టమాట ఫ్యూరీ – పావుకిలో, క్యాప్సికం క్యూబ్స్ – 200 గ్రా., కరివేపాకు – రెండు రెమ్మలు, నీళ్లు – పావు లీటర్, కారం – ఒక టేబుల్ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
క్యాప్సికం టమాట మసాలా కర్రీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఎండుమిర్చి, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత గరం మసాలా, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలపాలి. మసాలాలు చక్కగా వేగిన తరువాత టమాట ఫ్యూరీ వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత క్యాప్సికం ముక్కలు, కరివేపాకు వేసి కలపాలి. వీటిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత నీళ్లు, కారం వేసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. చివరగా కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే క్యాప్సికం టమాట మసాలా కర్రీ తయారవుతుంది. దీనిని చపాతీ, అన్నం, పులావ్, పూరీ, పుల్కా ఇలా దేనితోనైనా తినవచ్చు. ఈ క్యాప్సికం టమాట మసాలా కర్రీని అందరూ లొట్టలేసుకుంటూ ఎంతో ఇష్టంగా తింటారు.