Carrot Ginger Soup : వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడి వేడిగా సూప్ ని తాగాలనిపించడం సహజం. అయితే చాలా మంది ఇన్ స్టాంట్ గా లభించే సూప్ ప్యాకెట్ లను తీసుకు వచ్చి సూప్ ను తయారు చేసి తీసుకుంటూ ఉంటారు. కానీ ఇలా లభించే ఇన్ స్టాంట్ సూప్ ప్యాకెట్ లల్లో ప్రిజర్వేటివ్స్ ను, ఫుడ్ కలర్స్ ను ఎక్కువగా కలుపుతూ ఉంటారు. ఇలాంటి సూప్ ను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి హాని కలుగుతుంది. కనుక మనం వీలైనంత వరకు ఇంట్లోనే సూప్ ను తయారు చేసి తీసుకోవడం మంచిది. మనం సులభంగా అప్పటికప్పుడు తయారు చేసుకోగలిగిన రుచికరమైన వెరైటీ సూప్ లల్లో క్యారెట్ జింజర్ సూప్ కూడా ఒకటి.
అల్లం, క్యారెట్ కలిపి చేసే ఈ సూప్ చాలా రుచిగా ఉంటుంది. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఇలా సూప్ ను తయారు చేసి తీసుకోవచ్చు. ఈ సూప్ ను తయారు చేయడం చాలా సులభం. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ క్యారెట్ జింజర్ సూప్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
క్యారెట్ జింజర్ సూప్ తయారీకి కావల్సిన పదార్థాలు..
క్యారెట్ – 300 గ్రా., నీళ్లు – 800 ఎమ్ ఎల్, బిర్యానీ ఆకు – 1, వెల్లుల్లి రెబ్బలు – 5, మిరియాలు – అర టేబుల్ స్పూన్, అల్లం – అర ఇంచు ముక్క, ఉప్పు – తగినంత, నూనె – ఒక టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు.
క్యారెట్ జింజర్ సూప్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత బిర్యానీ ఆకు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, మిరియాలు వేసి వేయించాలి. వీటిని 3 నిమిషాల పాటు వేయించిన తరువాత ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసి వేయించాలి. వీటిని పచ్చివాసన పోయే వరకు వేయించిన తరువాత అర లీటర్ నీళ్లు పోసి కలపాలి. క్యారెట్ ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తరువాత బిర్యానీ ఆకు తీసేసి క్యారెట్ ముక్కలను నీటితో సహా జార్ లో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత దీనిని పూర్తిగా వడకట్టాలి. ఇలా వడకట్టగా వచ్చిన సూప్ లో 300 ఎమ్ ఎల్ నీళ్లు పోసి కలపాలి. తరువాత ఈ సూప్ ను స్టవ్ మీద ఉంచి మరిగించాలి. సూప్ మరిగి దగ్గర పడిన తరువాత ఉప్పు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా క్యారెట్ మరియు అల్లంతో రుచిగా సూప్ చేసి తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.