Carrot Peanut Fry : క్యారెట్.. వీటిని కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. క్యారెట్ మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. క్యాన్సర్ బారిన పడకుండా చేయడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, రక్తపోటును అదుపులో ఉంచడంలో, కంటి చూపును పెంచడంలో క్యారెట్ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా క్యారెట్ ను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మన ఆరోగ్యానికి మేలు చేసే ఈ క్యారెట్ ను మనం వివిధ రకాల వంటల్లో ఉపయోగిస్తాం కానీ దీనితో కూరలు చేసుకుని తినడానికి చాలా మంది ఇష్టపడరు. కానీ కింద చెప్పిన విధంగా చేసిన క్యారెట్ ఫ్రైను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. క్యారెట్ ఫ్రైను రుచిగా, సులువుగా ఎలా తయారు చేసుకోవాలి… తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
క్యారెట్ పల్లీల ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన క్యారెట్ – అర కిలో, నీళ్లు – 200 ఎమ్ ఎల్, పల్లీలు – పావు కప్పు, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, శనగపప్పు – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, నువ్వులు – పావు కప్పు, ఎండుకొబ్బరి పొడి – పావు కప్పు, ఉప్పు – తగినంత, వెల్లుల్లి రెబ్బలు – 8, కారం – ఒక టేబుల్ స్పూన్, నూనె – 3 టేబుల్ స్పూన్స్, ఆవాలు – ఒక టీ స్పూన్, కరివేపాకు – ఒక రెబ్బ, పసుపు – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.

క్యారెట్ పల్లీల ఫ్రై తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో నీటిని పోసి వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక క్యారెట్ ముక్కలను వేసి మూత పెట్టి ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. తరువాత క్యారెట్ ముక్కల్లోని నీరు పోయేలా వడకట్టుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో పల్లీలు వేసి 3 నిమిషాల పాటు వేయించాలి. తరువాత ధనియాలు, జీలకర్ర వేసి వేయించాలి. ఇది వేగిన తరువాత నువ్వులు వేసి చిటపటా అయ్యే వరకు వేయించాలి. తరువాత ఎండుకొబ్బరి పొడి వేసి కొద్దిగా రంగు మారే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత వీటిని ఒక జార్ లోకి తీసుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి. తరువాత ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, కారం వేసి మరోసారి మిక్సీ పట్టుకుని పక్కకు పెట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి.
నూనె వేడయ్యాక ఆవాలు, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత పసుపు వేసి కలపాలి. తరువాత ఉడికించిన క్యారెట్ ముక్కలు వేసి 10 నుండి 12 నిమిషాల పాటు వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న మసాలా పొడి వేసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు వేయించాలి. చివరగా కొత్తిమీరను చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే క్యారెట్ పల్లీల ఫ్రై తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. క్యారెట్ తో ఈ విధంగా ఫ్రై చేసి పిల్లలకు ఇవ్వడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని అందించవచ్చు.