Cashew Chikki : మనం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో జీడిపప్పు కూడా ఒకటి. జీడిపప్పు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో మన శరీరానికి అవసరమయ్యే పోషకాలతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. జీడిపప్పును తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చని నిపుణులు కూడా చెబుతూ ఉంటారు. జీడిపప్పును వంటల్లో వాడడంతో పాటు దీనితో మనం ఎంతో రుచిగా ఉండే చిక్కీని కూడా తయారు చేసుకోవచ్చు. జీడిపప్పు చిక్కీ మనకు ఎక్కువగా స్వీట్ షాపుల్లో లభిస్తూ ఉంటుంది. ఈ జీడిపప్పు చిక్కీని మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. మొదటిసారి చేసే వారు కూడా దీనిని సులభంగా చేసుకోవచ్చు. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే జీడిపప్పు చిక్కీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
జీడిపప్పు చిక్కీ తయారీకి కావల్సిన పదార్థాలు..
జీడిపప్పు – 2 కప్పులు, బెల్లం తురుము – ఒక కప్పు, నీళ్లు – పావు కప్పు, యాలకుల పొడి – చిటికెడు, నెయ్యి – ఒక టీ స్పూన్.
జీడిపప్పు చిక్కీ తయారీ విధానం..
ముందుగా జీడిపప్పును కళాయిలో వేసి మాడిపోకుండా దోరగా వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో బెల్లం తురుము, నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లం కరిగిన తరువాత ఉండ పాకం వచ్చే వరకు ఉడికించాలి. బెల్లం పాకాన్ని నీటిలో వేసి చూస్తే ఉండలాగా దగ్గరికి రావాలి. బెల్లం పాకం సిద్దం కాగానే యాలకుల పొడి, నెయ్యి వేసి కలపాలి. తరువాత వేయించిన జీడిపప్పు వేసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసుకున్న ప్లేట్ లోకి తీసుకుని సమానంగా చేసుకోవాలి.
ఇది కొద్దిగా చల్లారిన తరువాత మనకు కావల్సిన ఆకారంలో గాట్లు పెట్టుకోవాలి. తరువాత దీనిని పూర్తిగా చల్లారే వరకు అలాగే ఉంచాలి. తరువాత ముక్కలుగా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే జీడిపప్పు చిక్కీ తయారవుతుంది. ఈ విధంగా జీడిపప్పుతో చిక్కిని తయారు చేసి తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్నికూడా పొందవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.