Chakkera Pongali : మనం వంటింట్లో రకరకాల తీపి వంటకాలను వండుతూ ఉంటాం. చాలా సులభంగా చాలా తక్కువ సమయంలో చేసుకోదగిన తీపి వంటకాల్లో చక్కెర పొంగలి కూడా ఒకటి. చక్కెర పొంగలి చాలా రుచిగా ఉంటుంది. ప్రసాదంగా కూడా దీనిని వండుతూ ఉంటారు. చాలా మంది చక్కెర పొంగలిని ఇష్టంగా తింటారు. ఎవరైనా చేసుకోగలిగేలా, చాలా సులభంగా అలాగే చాలా రుచిగా ఉండేలా ఈ చక్కెర పొంగలిని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చక్కెర పొంగలి తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం – 200 గ్రా., పెసరపప్పు – 50 గ్రా., బెల్లం – 100 గ్రా., పంచదార – 100 గ్రా., డ్రై ఫ్రూట్స్ – కొద్దిగా, ఎండు కొబ్బరి ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, యాలకుల పొడి – పావు టీ స్పూన్.
చక్కెర పొంగలి తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్, కొబ్బరి ముక్కలు వేసి ఎర్రగా వేయించి పక్కకు ఉంచాలి. తరువాత మరో గిన్నెలో బెల్లం, పంచదార, నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లం కరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు ఉంచాలి. తరువాత గిన్నెలో పెసరపప్పు, బియ్యం వేసి శుభ్రంగా కడగాలి. తరువాత ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల చొప్పున నీళ్లు పోసి బియ్యం మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. ఇలా ఉడికిన తరువాత నెయ్యి, కరిగించిన బెల్లం వేసి కలపాలి. దీనిని దగ్గర పడే వరకు కలుపుతూ ఉడికించిన తరువాత యాలకుల పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్, కొబ్బరి ముక్కలు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చక్కెర పొంగలి తయారవుతుంది. తీపి తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇలా చక్కెర పొంగలిని తయారు చేసుకుని తినవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.