Chana Dal Omelette Curry : శనగపప్పు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. వీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. శనగపప్పును ఆహారంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. శనగపప్పుతో పిండి వంటకాలే కాకుండా కూరలను కూడా తయారు చేస్తూ ఉంటాం. శనగపప్పుతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో శనగపప్పు ఆమ్లెట్ కూర కడా ఒకటి. ఇది ఎక్కువగా ముస్లింలు తయారు చేస్తూ ఉంటారు. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. అలాగే తయారు చేయడం కూడా చాలా తేలిక. రుచిగా, కమ్మగా శనగపప్పు ఆమ్లెట్ కూరను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
శనగపప్పు ఆమ్లెట్ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 2, యాలకులు – 2, బిర్యానీ ఆకు – చిన్నది ఒకటి, జీలకర్ర – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 3, తరిగిన టమాట – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు -తగినంత, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, ధనియాల పొడి – అర టీ స్పూన్, కారం -ఒక టీ స్పూన్, మిరియాల పొడి – అర టీ స్పూన్, గంట పాటు నానబెట్టిన శనగపప్పు – ఒక కప్పు, నీళ్లు – 3 కప్పులు, తరిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్.
ఆమ్లెట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
కోడిగుడ్లు -4, పసుపు – పావు టీ స్పూన్, మిరియాల పొడి – అర టీ స్పూన్, ఉప్పు – కొద్దిగా, టమాట తరుగు – 2 టేబుల్ స్పూన్స్, చిన్నగా తరిగిన చిన్న ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 1, నూనె – ఒక టీ స్పూన్.
శనగపప్పు ఆమ్లెట్ కూర తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మసాలా దినుసులు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత టమాట ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. టమాట ముక్కలు మెత్తబడిన తరువాత ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత శనగపప్పు వేసి కలపాలి. దీనిని 2 నిమిషాల పాటు వేయించిన తరువాత నీళ్లు పోసి కలపాలి. తరువాత కొత్తిమీర వేసి మూత పెట్టి 2 విజిల్స్ మధ్యస్థ మంటపై ఒక విజిల్ పెద్ద మంటపై వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత గిన్నెలో కోడిగుడ్లు, మిరియాల పొడి, పసుపు, ఉప్పు వేసి బీట్ చేసుకోవాలి. తరువాత టమాట తరుగు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి మరలా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు నెం మీద నూనె వేసి వేడి చేయాలి. తరువాత సగం కోడిగుడ్డు మిశ్రమాన్ని ఆమ్లెట్ లా వేసుకోవాలి.
దీనిని 90 శాతం కాల్చుకున్న తరువాత మధ్యలోకి మడిచి పక్కకు ఉంచాలి. తరువాత మిగిలిన మిశ్రమాన్ని ఆమ్లెట్ లా వేసుకోవాలి. దీనిని కూడా 90 శాతం వేయించి మధ్యలోకి మడిచి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఆమ్లెట్ ను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి మరలా స్టవ్ మీద ఉంచి ఉడికించాలి. కూర చక్కగా ఉడుకుపట్టిన తరువాత రెండు చిటికెల గరం మసాలా, కొత్తిమీర, ఆమ్లెట్ ముక్కలు వేసి కలపాలి. దీనిని మరో 5 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే శనగపప్పు ఆమ్లెట్ కూర తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. శనగపప్పుతో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా కూడా తయారు చేసుకుని తినవచ్చు.