Chepala Fry : ఆదివారం వచ్చిందంటే చాలు.. చాలా మంది నాన్ వెజ్ వంటలను తినేందుకు ఇష్టం చూపిస్తుంటారు. ఇక వేసవిలో అయితే చికెన్, మటన్ కన్నా చేపలనే ఎక్కువ మంది తింటుంటారు. అయితే కొందరు చేపల పులుసు కన్నా ఫ్రై అంటేనే ఇష్టపడతారు. ఈ క్రమంలోనే కింద చెప్పిన విధంగా అరకిలో చేపలతో ఫ్రై చేస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి దీన్ని చేస్తే మళ్లీ ఇలాగే చేసుకుంటారు. చేపలతో అద్భుతంగా వచ్చేలా ఫ్రై ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చేపల ఫ్రై తయారీకి కావలసిన పదార్థాలు..
చేపలు – 500 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, కార్న్ పౌడర్ – రెండు టేబుల్ స్పూన్లు, ఒక టేబుల్ స్పూన్ శనగపిండి, ఉప్పు టేబుల్ స్పూన్, కారం టేబుల్ స్పూన్, గరంమసాలా టేబుల్ స్పూన్, నిమ్మకాయ ఒకటి, పెరుగు చిన్నకప్పు, ఫుడ్ కలర్ చిటికెడు, నూనె – తగినంత.
చేపల ఫ్రై తయారీ విధానం..
ముందుగా చేపలను శుభ్రంగా కడిగి మరీ పెద్ద సైజులో కాకుండా మోస్తరుగా కత్తిరించి పెట్టుకోవాలి. చేప ముక్కలు చిన్నగా ఉన్నప్పుడే బాగా ఉప్పు, కారం పడతాయి. శుభ్రం చేసుకున్న చేపలను ఒక గిన్నెలో తీసుకొని వాటిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం పొడి, ఉప్పు, శనగపిండి, కార్న్ పౌడర్, గరం మసాల, పెరుగు వేసి బాగా కలపాలి. ఇందులోకి మనకు అవసరం అనుకుంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు లేకపోతే లేదు అది మీ ఇష్టం. అదేవిధంగా నిమ్మకాయ రసం వేసిఈ మిశ్రమం మొత్తం చేప ముక్కలకు అంటుకునే విధంగా కలపాలి. ఈ విధంగా కలిపిన చేపల మిశ్రమాన్ని రెండు గంటల పాటు ఫ్రిజ్ లో ఉంచుకోవాలి.
రెండు గంటల తర్వాత ఫ్రిజ్ నుంచి బయటకు తీసి పాన్ పై కొద్దిగా నూనె వేసి చేప ముక్కలను చిన్న మంటపై అటూ ఇటూ కదిలిస్తూ చేప ముక్క ముదురు ఎరుపు రంగు వచ్చే వరకు వేయించాలి. ఈ విధంగా అన్ని ముక్కలను వేయించిన తర్వాత వీటిపై కొద్దిగా నిమ్మకాయ పిండాలి. అనంతరం వీటిని ఉల్లిపాయ ముక్కలతో సర్వ్ చేసుకోవాలి. ఇలా వీటిని తింటే ఎంతో రుచిగా ఉంటాయి.