Paneer Payasam : పాయసం అంటే సహజంగానే చాలా మందికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. తియ్యని పదార్థం కనుక అందరూ ఇష్టంగానే తింటారు. ఈ క్రమంలోనే పాయసంలోనూ మనకు అనేక వెరైటీలు అందుబాటులో ఉన్నాయి. అలాంటి వాటిల్లో పనీర్ పాయసం కూడా ఒకటి. పనీర్‌తో చాలా మంది వివిధ రకాల మసాలా వంటకాలను చేస్తుంటారు. కానీ దీంతో తియ్యగా ఉండే పాయసాన్ని కూడా చేయవచ్చు. దీన్ని చేయడం కూడా సులభమే. ఈ క్రమంలోనే పనీర్ పాయసాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పనీర్ పాయసం తయారీకి కావల్సిన పదార్థాలు..
పన్నీర్ – ఒక కప్పు, చిక్కటి పాలు – ఒక లీటర్, చక్కెర – పావు కప్పు, బియ్యపు పిండి – ఒక టేబుల్ స్పూన్, యాలకుల పొడి – పావు టీ స్పూన్, డ్రై ఫ్రూట్స్ – గుప్పెడు, కుంకుమ పువ్వు – చిటికెడు, నెయ్యి – టేబుల్ స్పూన్.
పనీర్ పాయసం తయారీ విధానం..
ముందుగా టేబుల్ స్పూన్ నెయ్యి వేసి డ్రైఫ్రూట్స్ ను దోరగా వేయించుకోవాలి. తరువాత స్టవ్‌పై ఒక గిన్నెలో పాలను పోసి పాలు బాగా మరిగే దాకా కలియబెడుతూ ఉండాలి. పాలు బాగా మరిగిన తరువాత కుంకుమ పువ్వు, బియ్యపు పిండి వేసి ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. పది నిమిషాలు బాగా ఉడికిన తరువాత ఈ మిశ్రమంలో ముందుగా వేయించుకున్న కొన్ని డ్రైఫ్రూట్స్, యాలకులపొడి వేసి రెండు నిమిషాల పాటు ఉడికించి తరువాత పంచదార వేయాలి. పంచదార వేసిన తరువాత ఈ మిశ్రమం గట్టిపడేవరకు ఉడికించుకోవాలి. ఈ మిశ్రమం గట్టిపడుతున్న క్రమంలో మంటను తగ్గించుకుని పన్నీర్ తురుము వేసి బాగా కలియబెట్టాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడిగా ఉన్న ఈ పాయసంలోకి మిగిలిన డ్రై ఫ్రూట్స్ వేసి సర్వింగ్ బౌల్‌లో తీసుకొని వేడివేడిగా తింటే ఎంతో రుచికరంగా ఉంటుంది.