Chicken Masala Garelu : మనలో చాలా మంది చికెన్ ను ఇష్టంగా తింటూ ఉంటారు. చికెన్ తో రకరకాల కూరలు, ఫ్రైలు, బిర్యానీలను తయారు చేస్తూ ఉంటాము. చికెన్ తో చేసే ఏ వంటకమైన కూడా చాలా రుచిగా ఉంటుంది. అయితే తరుచూ చేసే వంటకాలు కాకుండా చికెన్ తో మనం ఎంతో రుచిగా ఉండే గారెలను కూడా తయారు చేసుకోవచ్చు. చికెన్ గారెలు పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలాచక్కగా ఉంటాయి. చికెన్ గారెలను తయారు చేయడం చాలా సులభం. చికెన్ తో సులభంగా, రుచిగా, క్రిస్పీగా గారెలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ మసాలా గారెలు తయారీకి కావల్సిన పదార్థాలు..
బోన్ లెస్ – 150 గ్రా., నానబెట్టిన పచ్చి శనగపప్పు -ఒక కప్పు, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 3, తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన కరివేపాకు – ఒక రెమ్మ, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.

చికెన్ మసాలా గారెలు తయారీ విధానం..
ముందుగా జార్ లో నానబెట్టిన శనగపప్పును వేసి బరకగా మిక్సీ పట్టుకుని గిన్నెలో వేసుకోవాలి. తరువాత అదే జార్ లో చికెన్ ను కూడావేసి మెత్తగా మిక్సీ పట్టుకుని అదే గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడిచేయాలి. నూనె వేడయ్యాక అరటిఆకు మీద లేదా పాలిథిన్ కవర్ మీద నూనె రాసి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ గారెల ఆకారంలో వత్తుకుని నూనెలో వేసుకోవాలి. ఈ గారెలు మరీ మందంగామరీ పలుచగా ఉండకుండా చూసుకోవాలి. ఇలా నూనెకు తగినన్ని గారెలను వేసుకున్న తరువాత అటూ ఇటూ తిప్పుతూ మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే చికెన్ మసాలా గారెలు తయారవుతాయి. ఇలాతయారు చేసిన చికెన్ గారెలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. చికెన్ తో తరుచూ వంటకాలే కాకుండా అప్పుడప్పుడూ ఇలా గారెలను కూడా తయారు చేసుకుని తినవచ్చు.