Chicken Samosa : మనం స్నాక్స్ గా తీసుకునే వాటిల్లో సమోసాలు కూడా ఒకటి. సమోసాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అలాగే మనం రుచికి తగినట్టు వివిధ రుచుల్లో వీటిని తయారు చేస్తూ ఉంటాము. మనం ఎక్కువగా పనీర్ సమోసా, ఉల్లిపాయ సమోసా, స్వీట్ కార్న్ సమోసా వంటి వాటిని తయారు చేస్తాము. వీటితో పాటు మనం చికెన్ సమోసాను కూడా తయారు చేసుకోవచ్చు. చికెన్ సమోసా కూడా చాలా రుచిగా ఉంటుంది. అలాగే మైదాపిండికి బదులుగా గోధుమపిండితో ఈ సమోసాలను తయారు చేసుకోవచ్చు. ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా అందరూ ఈ సమోసాలను ఇష్టంగా తింటారు. గోధుమపిండితో క్రిస్పీగా, రుచిగా చికెన్ సమోసాలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ సమోసా తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమపిండి – 2 కప్పులు, ఉప్పు – తగినంత, వేడి నూనె – 2 టేబుల్ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
స్టఫింగ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు – 2, తరిగిన కరివేపాకు -ఒక రెమ్మ, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, చికెన్ కీమా – 400 గ్రా., ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
చికెన్ సమోసా తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో గోధుమపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, వేడి నూనె వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. తరువాత దీని మీద మూత పెట్టి పక్కకు ఉంచాలి. తరువాత స్టఫింగ్ కోసం కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తరువాత కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తరువాత కీమా, ఉప్పు, పసుపు వేసి కలపాలి. తరువాత మూత పెట్టి 5 నిమిషాల పాటు వేయించాలి. తరువాత చికెన్ మెత్తగా ఉడికే వరకు వేయించాలి. తరువాత మిగిలిన పదార్థాలను వేసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు వేయించి కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత పిండిని మరోసారి కలుపుకోవాలి. తరువాత పిండిని ఉండలుగా చేసుకోవాలి. తరువాత ఒక్కో ఉండను తీసుకుని పొడి పిండి చల్లుకుంటూ చపాతీలా వత్తుకోవాలి.
ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత వీటిని ఒక్కొక్కటిగా వేడి వేడి పెం మీద వేసి రెండు వైపులా 5 సెకన్ల పాటు కాల్చుకోవాలి. ఇలా అన్నింటిని కాల్చుకున్న తరువాత ఒక్కో చపాతీని తీసుకుని వెడల్పు పట్టీలుగా కట్ చేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో మైదాపిండిని తీసుకుని తగినన్ని నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత ఒక్కో సమోసా షీట్ ను తీసుకుని సమోసా ఆకారంలో చుట్టుకోవాలి. తరువాత లోపల చికెన్ స్టఫింగ్ ను ఉంచి అంచులకు మైదాపిండిని రాసి సమోసా ఆకారంలో చుట్టుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. తరువాత సమోసాలను నూనెలో వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ సమోసాలు తయారవుతాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.