Chinthapandu Palli Chutney : మనం వంటింట్లో రకరకాల పచ్చళ్లను తయారు చేస్తూ ఉంటాం. ఈ పచ్చళ్లను తయారు చేయడంలో మనం ఎక్కువగా చింతపండును ఉపయోగిస్తూ ఉంటాం. చింతపండును ఉపయోగించి చేసే పచ్చళ్లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. అలాగే చింతపండును, పల్లీలను వేసి మనం పల్లి పచ్చడిని కూడా తయారు చేస్తూ ఉంటాం. ఈ పచ్చడిని పాతకాలంలో ఎక్కువగా తయారు చేసేవారు. ఈ పల్లి పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఒక్క చుక్క నూనె ఉపయోగించకుండా మనం ఈ పచ్చడిని తయారు చేసుకోవచ్చు. చింతపండు, పల్లీలను ఉపయోగించి చేసే ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి… తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చింతపండు పల్లి పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
చింతపండు – 20 గ్రా., వేడి నీళ్లు – అర కప్పు, పల్లీలు – ఒక టేబుల్ స్పూన్, శనగపప్పు – 2 టీ స్పూన్స్, మినపప్పు – 2 టీ స్పూన్స్, ధనియాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, మెంతులు – పావు టీ స్పూన్, కరివేపాకు – 2 రెమ్మలు, ఎండుమిర్చి – 10 లేదా తగినన్ని, ఎండుకొబ్బరి ముక్కలు – ఒక టేబుల్ స్పూన్, నువ్వులు – ఒక టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 4, ఉప్పు – తగినంత, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు.
చింతపండు పల్లి పచ్చడి తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో చింతపండును తీసుకుని అందులో వేడి నీటిని పోసి నానబెట్టాలి. వేడి నీటిని పోయడం వల్ల చింతపండు త్వరగా నానడమే కాకుండా పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. తరువాత ఒక కళాయిలో పల్లీలను వేసి దోరగా వేయించాలి. తరువాత వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు తప్ప మిగిలిన పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి మాడిపోకుండా వేయించాలి. ఈ పదార్థాలన్నీ చల్లారిన తరువాత వాటిని జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి.
తరువాత నానబెట్టిన చింతపండును నీటితో సహా వేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేలా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత దీనిలో ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చింతపండు పల్లి పచ్చడి తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, వంట చేసే సమయం లేనప్పుడు ఇలా పల్లీలతో పచ్చడిని తయారు చేసుకుని తినవచ్చు. ఈ పచ్చడిని అందరూ ఇష్టంగా తింటారు.